హైదరాబాద్, మార్చి 17,
పవన్ కళ్యాణ్ కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌ని హీటేక్కించాయి. తెలంగాణ బీజేపీని కలవర పెట్టించాయి. ఓ పక్కా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంటే.. పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నేతలు ఖంగుతున్నారు. మరీ జనసేనాని తెలంగాణ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లేనా.. ఉన్నట్టుండి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి పవన్ ఎందుకు మద్దతు ప్రకటించారు. పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ బీజేపీపై ఉన్న కోపాన్నంతా జనసేన ఆవిర్భావ వేదికపై పవన్ వెల్లగక్కారు. జనసేన పార్టీని, నాయకులను చులకన చేసి మాట్లాడుతున్నారని పవన్ ఆరోపించారు. జాతీయ పార్టీతో సత్ససంబంధాలున్నా.. తెలంగాణ బీజేపీతో పొసగలేకపోతున్నామని పవన్ ఖరాకండిగా చెప్పేశారు. పైగా టీఆర్ఎస్ అభ్యర్థి, పీవీ కూతురుకు తమ మద్దతు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. సరిగ్గా పోలింగ్ నాడే పవన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పెద్ద సెన్షెషన్‌గా మారింది. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్‌ను విమర్శించిన పవన్ సడన్‌గా ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో కాస్త గందరగోళానికి గురిచేసింది. పవన్ వ్యాఖ్యలపై బీజేపీ రాష‌్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తన పార్టీకి అన్యాయం జరిగితే తమతో చర్చించాల్సి ఉండేదన్నారు. కానీ పోలింగ్ రోజే టీఆర్ఎస్ అభ్యర్థికి పవన్ మద్దతు ప్రకటించడంతో కాస్త బాధకలిగిందన్నారు. పవన్ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలింగ్ రోజు ఒక అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది కచ్చితంగా ఎన్నికల రూల్స్ కి అతిక్రమించడమే అని అంటున్నారు. అయితే తాము సుమోటోగా కేసు నమోదు చేయలేమని ఈసీ వెల్లడించింది. కానీ ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. దర్యాప్తు చేసి కేసు చేస్తామన్నారు., తెలంగాణ బీజేపీకి పవన్ కల్యాణ్‌కు మొదటి నుంచి పెద్దగా సయోధ్య కుదరడం లేదు. మొన్న గ్రేటర్ ఎన్నికల్లోనే ఇదే స్పష్టమైంది. మొదట పవన్ కల్యాణ్ జనసేన తరఫున అభ్యర్థులను కూడా ప్రకటించారు. తర్వాత బీజేపీ అధిష్ఠానం సూచన మేరకు జనసేన వెనక్కితగ్గింది. అప్పటి నుంచే తెలంగాణ బీజేపీకి పవన్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న పవన్ ఇప్పుడు సడన్‌గా బీజేపీపై విమర్శలు చేయడంతో గందరగోళం నెలకొంది. అయితే తెలంగాణలో పార్టీ విస్తరణపై జనసేనాని నజర్ పెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదీ ఏమైనా పవన్ కల్యాణ్ కరెక్ట్ టైం చూసి పెద్ద బాంబు పేల్చారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి