YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

సరిహద్దుల్లో కరోనా టెన్షన్

సరిహద్దుల్లో కరోనా టెన్షన్

నిజామాబాద్, మార్చి 17, 
నిజామాబాద్ జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేసింది. పొరుగు రాష్ట్రంలో నాందేడ్ జిల్లాకు నిజామాబాద్ జిల్లాతో అనుబంధం ఉంది. ప్రజలు నిత్యం వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. గత వారం రోజుల నుంచి కరోనా కేసులు పెరగడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం లేదు. బోధన్ మండలం సాలూరా అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద నామ మాత్రపు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజు వారి రాకపోకలు యదావిధిగా సాగుతున్నాయి. నిత్యం వేలాది వాహనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తున్నాయి.చెక్ పోస్టు వద్ద తప్పనిసరి తనిఖీలు నిర్వహించి, కరోనా పరీక్షలు చేపట్టాల్సి ఉన్నా వైద్య అధికారులు నామ మాత్రంగానే చర్యలు చేపట్టారు. మీడియా ప్రతినిధులు చెక్ పోస్ట్ వద్దకు వస్తున్నారని తెలియగానే రాగానే వైద్య అధికారులు అప్రమత్తం అవుతున్నారు. వాళ్ళు వెళ్ళే దాకా హడావుడి చేసి పరీక్షలు చేస్తున్నారు. కానీ నాలుగు రోజులుగా కేవలం 72 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు అంటే నిర్లక్ష్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటివరకు 72 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 12 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడిన వారిని తిరిగి వెనక్కి పంపుతున్నారు. అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
హాస్టల్ లో కొవిడ్ పంజా
ఒకప్పుడు కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న హైదరాబాద్‌లో పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. స్కూళ్లు తిరిగి ప్రారంభమైన తర్వాత కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.. ఇవాళ నాగోల్ బండ్లగూడలోని మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఒకే సారి భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగు చూడడం సంచలనంగా మారింది.. మైనార్టీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఇప్పటి వరకు ఏకంగా 38 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. విద్యార్థులు, స్టాఫ్‌కు కూడా టెస్టులు చేసే పనిలో పడిపోయారు. ఇంకా ఎంతమందికి కరోనా పాజిటివ్‌గా తేలుతుందోననే టెన్షన్ మొదలైంది.

Related Posts