నెల్లూరు మార్చి 17,
రాజధాని ప్రాంతంలో తమను మోసం చేసి, తమకు తెలియకుండానే చంద్ర బాబు నాయుడు భూములు తీసుకు న్నారని ఎవరైనా ఈ ప్రభుత్వానికి గానీ, ముఖ్యమంత్రికి గానీ ఫిర్యాదు చేశారా అని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి 10 సెక్షన్ల కింద నోటీసులివ్వడం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడమనేది చాలా దుర్మార్గమన్నారు. స్థానిక ఎన్నికల్లో డబ్బు, అధికార బలం, పోలీసులతో గెలవగానే ఈప్రభుత్వానికి అహంకా రం నెత్తికెక్కినట్లుగా తనకు అనిపిస్తోందన్నారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఏం సంబంధముందని రాజధాని భూముల విషయంలో జోక్యం చేసుకున్నాడో చెప్పాలన్నారు. ఏ ఒక్క దళితుడైనా ఆయన వద్దకు వెళ్లి, చంద్రబాబునాయుడు తనను మోసం చేసి భూములు తీసుకున్నాడని ఫిర్యాదు చేశాడా అని మాజీ మంత్రి నిలదీశారు.ఇన్ సైడ్ ట్రేడింగ్ అనే పదమే లేదని, రాజధాని భూముల వ్యవహారంలో ఎక్కడా ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చిందన్నారు. దమ్మాలపాటి శ్రీనివాస్ అంశానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇదే విషయం చెప్పడం జరిగిందన్నారు. 4వేలు, 5వేలఎకరాలు ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆరోపణలు చేస్తూనే ఉందన్నారు. ఎవరో ఎస్టీ ఎస్సీ అసోసియేషన్ వారు ఆళ్ల రామకృష్ణారెడ్డితో మాట్లాడితే, దాన్ని సాకుగా చూపి చంద్రబాబు నాయుడిని బోను ఎక్కించాలని చూస్తారా అని మాజీమంత్రి మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం చేసిన భూసేకరణకు నిరసనగా సర్వేపల్లి నియోజక వర్గంలోని మనుబోలు మండలంలో వెంకన్నపాలెంలో దళిత యువకుడు ఆత్మహత్యా యత్నం చేశాడన్నారు. చెర్లోపల్లిలో ఇద్దరు దళిత మహిళలు తమ భూమి పోతుందన్న ఆవేదనతో పురుగుల మందు తాగడం జరిగిందన్నారు.