కడప మార్చి 17,
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు కడప ఉక్కు ప్యాక్టరీని వెంటనే నిర్మించడంతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిలిపివేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు ఓబులేసు, వేణుగోపాల్, శంకర్, డిమాండ్ చేశారు.గత కొంతకాలంగా కడపలో నిరసనలు కొనసాగిస్తున్న జేఏసీ నాయకులు పాదయాత్రను చేపట్టారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ నిలిపివే యాలని కోరుతూ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జమ్మలమడుగు నుంచి ప్రారంభమైన పాదయాత్ర ప్రొద్దుటూరుకు చేరు కుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై విభజన చట్టంలో హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదని విమర్శించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేసి ఉక్కు ఫ్యాక్టరీ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. 32 మంది ప్రాణత్యాగంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అయిందని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా నిలిచిందని ఆ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడం దుర్మా ర్గమన్నారు. ప్రైవేటీకరణ వలన రిజర్వేషన్లు రద్దయి ఎస్సీ, ఎస్టీ, బీసీలు నిరుద్యోగులుగా మారుతారని ఆవేదన వ్యక్తం చేశారు.