హైదరాబాద్ 17,
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లం చేస్తూ, హెచ్.ఎం.టీ.మాజీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమకు రావాల్సిన గ్రాట్యుటీ, ప్రోవిడెంట్ ఫండు, ఈ.ఎల్. ఎన్కాష్మెంట్, వేజ్ రివిజన్ బకాయిలు వెంటనే చెల్లించాలని, వారు హెచ్.ఎం.టి. యాజమాన్యాన్నీ, కేంద్ర ప్రభుత్వాన్నీ మరోసారి కోరుతూ, 2021 మర్చి, 17వ తేదీ బుధవారం, జీడిమెట్ల సమీపంలోని, హెచ్ఎంటీ మెషిన్టూల్స్ ఫ్యాక్టరీ ముందు నిరాహార దీక్ష, ధర్నా చేపట్టారు. ఉదయం 8 గంటలకే, పెద్ద సంఖ్యలో మాజీ ఉద్యోగులు నిరసన దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, వారు డిమాండ్ చేసారు.
గత నాలుగున్నర ఏళ్ళుగా రాని గ్రాట్యుటీ; గత రెండేళ్లుగా రాని ప్రోవిడెంట్ ఫండ్; పదేళ్ళు గా చెల్లించని ఈ.ఎల్. ఎన్ క్యాష్ మెంటు; ఇంకా గత 20 సంవత్సరాలుగా చెల్లిస్తారో, లేదో తెలియని వేజ్ రివిజన్ ఎరియర్స్ ఎప్పుడెప్పుడు కళ్ళ చూస్తామా అని, గంపెడాశతో ఎదురు చూస్తున్నామని, మాజీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
విశ్రాంత ఉద్యోగుల పట్ల, కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వారు ఆరోపించారు. యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఒక పక్క, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయటం లేదని చెబుతూ, మరోపక్క, పింజోరు, బెంగళూరు, మౌలాలి హైద్రాబాదు తో సహా, అనేక ప్రాంతాలలో, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అమ్మగా వచ్చిన నిధుల నుంచి కూడా తమ బాకాయిలు తీర్చకుండా, యాజమాన్యం ఇతర ఖర్చులకు, ఆ నిధులను మళ్లిస్తున్నారని, మాజీ ఉద్యోగులు పేర్కొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులకు ఉన్న చట్టబద్ధ హక్కులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, యాజమాన్యం తమ చట్ట బద్ద బాధ్యతలను విస్మరిస్తోందని, వారు వాపోయారు. హెచ్ఎంటీ మాజీ ఉద్యోగులు తమకు రావలసిన బకాయిలను చెల్లించాలని కోరుతూ, సంవత్సరాల తరబడి, విసుగు, విరామం లేకుండా, శాంతియుత ఆందోళనలను చేస్తుంటే, మేనేజ్మెంటుకు చీమ కుట్టినట్టు కూడా లేదని, వారు వాపోయారు. హెచ్.ఎం.టి. రిటైర్డ్ ఉద్యోగులు, తమకు రావలసిన బకాయిలు సకాలంలో అందక, చెప్పనలవి కాని దీనావస్థలో విశ్రాంత జీవనం గడుపుతున్నారు. తమకు, న్యాయంగా రావాల్సిన బకాయిలు అందక, తాము ఆర్ధికంగా అనేక ఇబ్బందులు పడుతూ, దీనావస్థలో ఉన్నామనీ, ప్రభుత్వం స్పందించి వెంటనే తమ సమస్యలను పరిష్కారించాలని హెచ్ఎంటీ రిటైర్డ్ ఉద్యోగులు పదే, పదే, విజ్ఞప్తి చేస్తున్నారు.
బకాయిల కోసం అర్రులు చాస్తూ, సమయానికి డబ్బులు అందక, చేసిన అప్పులు తీర్చలేక, అవమాన భారంతో, తమ సహచరులు ఎంతో మంది, తమ జీవితాలను కూడా చాలించారని, కొంతమంది మాజీ ఉద్యోగులు వారు కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యారు. ఇప్పుడయినా తమకు రావలసిన బాకాలు వస్తే, పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు, వైద్య ఖర్చులతో పాటు, ఇతర అత్యవసరాలకు, గత్యంతరం లేక చేసిన అప్పులు తీర్చుకోవచ్చని ఎదురు చూస్తున్నట్లు, కొంతమంది చెప్పారు. తమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని, కేంద్రప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు, యాజమాన్య మొండి వైఖరికి నిరసనగా వారు నినాదాలు చేశారు. పలువురు స్థానిక రాజకీయ నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, నిరసన శిబిరం వద్దకు వచ్చి, ఉద్యోగులకు సంఘీభావం వ్యక్తం చేశారు.