హైదరాబాద్, మార్చి 17,
రాష్ర్టంలోని రైతులకు రుణమాఫీ వందకు 100 శాతం చేసి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గవర్నర్లు కేబినెట్ అఫ్రూవ్ చేసిన ప్రసంగాన్ని చదువుతారు. మేం చేసింది పెద్దది కాబట్టి.. బుక్ పెద్దగా ఉంటుంది. మేం చేసింది చాలా ఉంది కాబట్టి.. ప్రసంగం ఎక్కువే ఉంటుంది. మేం చేసిన దాంట్లో మేం చెప్పింది చాలా తక్కువ అని తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఉచిత విద్యుత్ తాము అమలు చేశామని డబ్బాలు కొట్టుకునే అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నట్లు వివరించారు. కరోనా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో అన్ని వసతులు కల్పించామని చెప్పారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాత సచివాలయం స్థానంలో ప్రార్థనా మందిరాలు పునర్‌నిర్మిస్తామని స్పష్టం చేశారు. 39.36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదని గుర్తుచేశారు. సంక్షేమానికి ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా రాష్ట్ర గీతం నిర్ణయించలేదని తెలిపారు. గందిమళ్ల నిర్వాసితులకు గజ్వేల్ పక్కన ఏడున్నరవేల ఇళ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవాదుల హత్య కేసులో ఇప్పటికే చాలామంది అరెస్టయ్యారని గుర్తుచేశారు. ఆ హత్య కేసులో తమ పార్టీ మండల అధ్యక్షుడు హస్తం ఉందని వార్తలు రావడంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని వివరించారు. పెట్రోల్ ధరలను అదుపు చేయడం తమ చేతుల్లో లేదని అన్నారు.రు. 25 వేల వరకు ఎంత మందికి రుణాలు ఉండేనో... వారికి గత సంవత్సరం మాఫీ చేశాం. మిగతా వారి విషయంలో రేపు ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రుణమాఫీ చేయలేదు. పోడు భూముల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. 60 ఏండ్ల పాపాన్ని సమగ్రంగా పరిశీలించి పరిష్కరించుకుంటాం. పోడు భూముల విషయంలో పీఠముడి ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో నీటి తిరువా ముక్కుపిండి వసూలు చేశారు. తెలంగాణ రాష్ర్టంలో నీటి తిరువాను ఎత్తేశామన్నారు. ఉచిత కరెంట్‌ను రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. కానీ కరెంట్ వచ్చేది కాదు.. ఉత్త కరెంట్ కిందనే పోయేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ర్టంలో ఉచిత 24 గంటల నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నామని తెలిపారు. హై క్వాలిటీ పవర్ సప్లయి అవుతోంది. వరద కాల్వ మీద వందల, వేల మోటార్లను పెట్టుకునే వారు. కాకతీయ కాల్వ మీద కూడా వేల మోటార్లు పెట్టుకున్నప్పటికీ.. వాటి వద్దకు వెల్లొద్దని కరెంట్ అధికారులకు తాను సూచించానని చెప్పారు. రైతుల విషయంలో చాలా లిబరల్‌గా ఉన్నామని చెప్పారు. యాసంగిలో 52 లక్షల ఎకరాల సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం విషయంలో చాలా విషయాలు వస్తాయన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నాడు 128 ఎకరాల్లో పాలీ హౌజ్‌లు ఉంటే.. ఇప్పుడు 1300 ఎకరాల్లో ఉన్నాయి. సబ్సిడి కూడా 75శాతం ఇస్తున్నాం. 6 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు పంపిణీ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాల భ్రమల నుంచి భట్టి బయటకు రావాలని సీఎం కేసీఆర్ సూచించారు.
2, 3 రోజుల్లో పీఆర్సీ
ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. శాసనసభ వేదికగా రెండు, మూడు రోజుల్లోనే గౌరవప్రదమైన పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం చెప్పారు. ఉద్యోగుల మీద తమకెంత ప్రేమ ఉందో గత పీఆర్సీతోనే చూపించామన్నారు. మా ఉద్యోగులు కాలర్ ఎత్తుకుని ఇండియాలో తాము అత్యధిక జీతాలు పొందుతామని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామని చెప్పాం.. దాన్ని అమలు చేస్తున్నాం.. తాను ప్రకటించిన తర్వాత ఉద్యోగులు తప్పకుండా హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు.