హైదరాబాద్, మార్చి 17,
హైకోర్టు అడ్వకేట్ దంపతుల హత్య కేసుతో టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రికేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ దీనిపై మాట్లాడారు. ‘‘అడ్వకేట్ దంపతుల హత్య దురదృష్టకరం. ఖండిస్తున్నాం. ఈ హత్య కేసులో ఎవరున్నా సరే వదిలిపెట్టబోం. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశాం. కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కప్ప కుమార్, శ్రీనివాస్, బడారి లచ్చయ్య, వెల్ది వసంతరావును పోలీసులు అరెస్టు చేశారు. న్యాయవాది దంపతుల హత్య కేసులో మాకు, మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.హత్య కేసులో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్న మాట నిజమే. ఆ విషయం తెలిసిన మరుక్షణమే అతణ్ని పార్టీ నుంచి తొలగించాం. అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం వారు కూడా జైల్లో ఉన్నారు. ఈ కేసు విషయంలో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. ఈ కేసు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు’’ అని కేసీఆర్ ప్రసంగించారు.తెలంగాణ రాష్ర్టంలో పోలీసు శాఖ నిస్పక్షపాతంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ అన్నారు. ఎన్నికల సందర్భంలో కూడా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయలేదని అన్నారు. గత శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా తాను డీజీపీకి ఫోన్ చేయలేదని కేసీఆర్ అన్నారు.అడ్వకేట్ దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. భట్టి వ్యాఖ్యాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ కేసును హైకోర్టు మానిటరింగ్ చేస్తోంది. ఇండియాలోనే తెలంగాణ పోలీసులు అద్భుతంగా పని చేస్తున్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. 20 వేల వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మంచిగా పని చేసే మన పోలీసును కించపరుచుకోవడం సరికాదు. ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి ఇవ్వబోమని తేల్చిచెప్పారు. ఈ కేసులో దోషులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మనకు సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ ఉన్నప్పుడు.. సీబీఐకి అప్పగించడం ఎందుకు అని ప్రశ్నించారు.
57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్లపై త్వరలోనే ప్రకటన
వందకు వంద శాతం పేదల పక్షాన ఉన్నాం. కొన్ని దరఖాస్తులు పెన్షన్ల కోసం, ఇంకొన్ని రేషన్ కార్డుల కోసం పెండింగ్‌లో ఉన్నవి. మేం పొట్టలను నింపినోళ్లం.. కానీ పొట్టలను కొట్టినోళ్లం కాదు. 57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్ ఇస్తామని చెప్పాం. దానికి సంబంధించి త్వరలోనే ప్రకటన చేస్తాం. వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. నిరుద్యోగ భృతికి విధివిధానాలు రూపొందిస్తున్న సమయంలోనే కరోనా వచ్చిపడ్డది. దీని గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందని, బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.