తిరుపతి, మార్చ్17
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు బుధవారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో కనువిందు చేశారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో ఏర్పడిన కలహాన్ని నివారించి, సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంతో సాక్షాత్కరిస్తారు. తనకు భక్తులు కానివారు ఆ మాయాధీసులు కాక తప్పదనీ, తనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరని, ఈ మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు.
అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించనున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేస్తారు.