వాషింగ్టన్ మార్చ్ 17
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. అట్లాంటా ప్రాంతంలోని మూడు మసాజ్ పార్లర్లలో ఓ దుండగుడు కాల్పులు జరుపడంతో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఏడుగురు మహిళలే ఉండగా.. వీరిలో ఆరుగురు ఆసియన్లు ఉన్నారని పోలీసులు అధికారులు తెలిపారు. అయితే కాల్పులకు గల కారణాలు రాలేదు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట కాల్పులు జరిగిన సమయంలో పోలీసులు దోపిడీగా భావించారు. అనంతరం వాయువ్య ప్రాంతంలోని అక్వర్త్ సమీపంలోని యంగ్స్ ఏషియన్ మసాజ్ వద్ద జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారని చెరోకీ కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి చెందిన కెప్టెన్ జే బేకర్ తెలిపారు. మరో వ్యక్తి గాయపడ్డాడని.. ఘటన సాయంత్రం 5 గంటలకు జరిగిందని పేర్కొన్నారు. 5.47గంటల ప్రాంతంలో ఈశాన్య ప్రాంతంలో ఉన్న గోల్డ్ స్పా వద్ద జరిపిన కాల్పుల ఘటనలో ముగ్గురు మహిళల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.అధికారులు సంఘటన స్థలంలో ఉండగానే.. అరోమాథెరపీ స్పా వద్ద మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మరో మహిళ మృతి చెందిందని పోలీస్ చీఫ్ రోడ్నీ బ్రయంట్ తెలిపారు. కాల్పులకు తెగబడిన దుండగుడు వుడ్‌స్టాక్‌కు చెందిన రాబర్డ్ ఆరోన్‌లాంగ్‌ను రాత్రి 8.30గంటల ప్రాంతంలో జార్జియాలోని క్రిస్ప్ కౌంటీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు స్పాల్లో కాల్పులకు పాల్పడింది ఒకే వ్యక్తి అని గుర్తించినట్లు కెప్టెన్ జే బేకర్ పేర్కొన్నారు. అయితే కాల్పుల ఘటన వెనుక ఉన్న ఉద్దేశం తెలియదని.. ఆసియా మహిళలనే లక్ష్యంగా చేసుకునే దాడి జరిగినట్లు వెంటనే చెప్పడం కష్టమని పేర్కొన్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫీల్డ్ ఆఫీస్ ప్రతినిధి మాట్లాడుతూ చెరోకీ కౌంటీ, అట్లాంటా పోలీసులకు ఏజెన్సీ సహాయం అందజేస్తోందన్నారు.