YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జంక్షన్ లో జనసేనాని

జంక్షన్ లో జనసేనాని

విజయవాడ, మార్చి 18, 
కమలం పువ్వు చెంతనుంటే చాలు ఏపీలో అధికారంలోకి రావచ్చు అని జనసేనాని పవన్ కళ్యాణ్ తన లెక్కలేవో తాను వేసుకున్నారు. అది కూడా బంపర్ మెజారిటీతో మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయం ఇది. ఇపుడు రెండేళ్ళకు మోడీ రెండవ విడత పాలన దగ్గరపడుతోంది. మొదటిసారి సంగతేమో కానీ సెకండ్ టెర్మ్ లో మాత్రం మోడీ మీద జనాలకు బాగానే మోజు తగ్గిపోయింది. దాంతో పాటుగా ఇంత‌కంటే మించిన సమయం లేదని మోడీ మాస్టార్ హడావుడిగా కఠిన నిర్ణయాలను ఒక్కోటిగా తీసేసుకుంటున్నారు. ఈ పరిణామాలతో దేశం సంగతి ఎలా ఉన్నా ఏపీలో మాత్రం జనసేన ఉక్కిరిబిక్కిరి అవుతోంది.ఇక ఏపీకి ప్రాణప్రదంగా మారిన విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తామంటూ చావు కబురు కేంద్రం చల్లగా చెప్పేసింది. ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కేంద్రం మీదకు దాదాపుగా దండెత్తి దడపుట్టిస్తున్నాయి. కానీ బీజేపీ మౌనంగా ఉంటే దోస్తీ కట్టిన నేరానికి జనసేన కూడా ఏం చేయలేని నిస్సహాయతతో నిలిచింది. ఇపుడు కనుక పవన్ కల్యాణ్ బీజేపీ సంకెళ్ళను తెంచుకుని బయటకు వస్తే ఎంతగా అయినా చెలరేగిపోవచ్చు. నిజానికి చంద్రబాబుకు జగన్ కి ఉన్న భయాలు ఏవీ బీజేపీతో పవన్ కి లేవు. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ విశాఖ ఉక్కు ఉద్యమాన్ని తన స్వాధీనంలోకి తీసుకుంటే జనసేనకు మంచి బేస్ ఏర్పడేది.ఇక రాజకీయాల్లో నిన్నటిలా నేడు ఉండదు. అలాగే రేపు ఉండదు, 2014 నాటికి మోడీ ప్రభ మధ్యాహ్న మార్తాండుడి మాదిరిగా వెలిగిపోతోంది. నాడు ఎన్నికల్లో పోటీ చేయకుండా పక్క వాయిద్యానికే పవన్ కల్యాణ్ పరిమితం అయ్యారు. ఇక 2019 నాటికి బీజేపీ మీద ఏపీలో జనాలకు కోపం వున్నా పవన్ పొత్తు పెట్టుకుని ఉంటే కూటమికి కొంత అయినా మేలు జరిగేది. ఇపుడు 2024 నాటికి అంటూ పవన్ చాలా తొందరగానే వెళ్ళి బీజేపీతో చేతులు కలిపేశారు. రెండు సార్లు మోడీని ఆదరించిన దేశ జనం ఈసారి మూడ్ మార్చుకుంటే బీజేపీ పాటు పవన్ కల్యాణ్ పార్టీ కూడా నిండా మునిగిపోతుంది. అయినా పవన్ ఏ రకమైన సమీకరణలు నమ్ముకున్నారో ఏమో కానీ కమలం నీడను వీడడంలేదు అంటున్నారు.ఇక ఏపీలో వినిపిస్తున్న మాట ఏంటి అంటే టీడీపీ జనసేన, వామపక్షాలు కలిస్తే కచ్చితమైన కాంబో గా వైసీపీకి ఎదురునిలుస్తుందని. అయితే బీజేపీ ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న వేళ నోరు మెదపకుండా ఎన్నికల ముందు వెళ్ళి ఆయా పార్టీలతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నా ఫలితం ఉండదని కూడా అంటున్నారు. పవన్ కనుక రాజకీయంగా దూకుడు చేయాలంటే ఇప్పటికిపుడే బీజేపీ బంధం తెంచుకుని బయటకు వస్తేనే ఆయనకూ జనసేనకు భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు. మరి ఇప్పటికే రాజకీయంగా ఎన్నో తప్పటడుగులు వేసిన పవన్ కల్యాణ్ ఈసారి అయినా తెలివిడి చూపిస్తారా అన్నదే ఇక్కడ చర్చ.

Related Posts