YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సంక్షేమమే తారక మంత్రమా

సంక్షేమమే తారక మంత్రమా

గుంటూరు, మార్చి 18, 
ఏపీ జనాలకు సంక్షేమ పధకాల కోసమే అప్పులు చేశాం తప్ప మరోటి కాదు అంటున్నారు రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గర రాజేంద్రనాధ్ రెడ్డి. అప్పులు తెచ్చి తాము దుర్వినియోగం చేయలేదని కూడా ఆయన అంటున్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాలోకే నగదు బదిలీ అవుతోందని కూడా గుర్తు చేస్తున్నారు. ఇక కరోనా వేళ కూడా తాము ఏ ఒక్క పధకాన్ని వదలకుండా జనాలకు సక్సెస్ ఫుల్ గా అందచేశామని చెబుతున్నారు.సరే ఇచ్చే వారుంటే పుచ్చుకునే వారుంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ రాజ్యం నడుస్తోంది అంటే దేశం మొత్తం ఏపీ వైపు నాడు చూసింది. శభాష్ అని కూడా అంది. అయితే ఆ ఆందం, గర్వం ఎక్కువ కాలం నిలువలేదు. ఇపుడు కూడా దేశం మరో మారు ఏపీ గురించి చర్చించుకుంటోంది. ఏపీ అప్పుల కుప్ప అయిందని కాగ్ బయటపెట్టిన నివేదికను చూసి ఎకసెక్కమాడుతోంది కూడా. ఏపీ బడాయి వెనక ఇంత కధ ఉందా అని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది కూడా. దీంతో పాటే ఏపీని శభాష్ అన్న నోళ్ళే ఇది కూడా ఒక ఘనతేనా అంటున్నాయి.సంక్షేమ పధకాలు వైసీపీకి రాజకీయంగా పనికివచ్చాయా అన్నదే ఇపుడు పెద్ద చర్చ. ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని పధకాలు ఇచ్చినా కూడా జనం కాదనకుండా తీసుకుంటారు. కానీ ఓటు వేసే అవకాశం వచ్చినపుడు నిర్మొహమాటంగా తమ తీర్పుని వెల్లడిస్తారు. ఇక వైసీపీకి కూడా తమ సంక్షేమం మీద నమ్మకం లేనట్లుగా ఉంది. అందుకే ఏకగ్రీవాల వైపే ఎక్కువగా దృష్టి సారించింది అని ప్రత్యర్ధుల నుంచి విమర్శలు ఎటూ ఉన్నాయి. సంక్షేమానికి ఓట్లు రాలుతాయా? అంటే నూటికి నూరు పాళ్ళూ అవును అని కానీ కాదని కానీ చెప్పలేని స్థితి ఉందిపుడు.ఏపీ కొత్త రాష్ట్రం కిందనే లెక్క. మరో వైపు చూస్తే కేంద్ర సాయం లేదు. ఇంకో వైపు చంద్రబాబు తన ప్రయారిటీలతో నాడు అప్పులు తెచ్చి ఏపీని ఇబ్బందులలోకి నెట్టారు. ఇపుడు జగన్ అప్పులు తెచ్చి జనాలకే ఇస్తున్నారు. అది పేదల వరకూ బాగానే ఉన్నా అనర్హులు కూడా ఈ లిస్ట్ లో చేరి లబ్ది పొందుతున్నారు అన్న ఆరొపణలు ఉన్నాయి. ఇక ఇన్నేసి పధకాలు కూడా అవసరం లేదన్న మాట కూడా మేధావుల నుంచి ఉంది. ఇక ఏపీలో రాబడి వచ్చే రంగాల మీద ప్రభుత్వం ఇంకా ఫోకస్ సరిగ్గా పెట్టడంలేదని ఈ ఆర్ధిక సంవత్సరం ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఓ వైపు పెట్రోల్ డీజిల్ ధరలు నింగినంటున్నా ఏపీకి ఆదాయంగా వచ్చింది అరవై శాతమే అని లెక్కలు చెబుతున్నాయి. అలాగే మద్యం విషయంలో కూడా అనుకున్న ఆదాయం రాలేదు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల, వాణిజ్య పన్నుల ద్వారా ఆదాయం పూర్తిగా తెచ్చుకోలేకపోతోంది అంటే జగన్ సర్కార్ ఫెయిల్యూర్ కిందనే లెక్క కట్టారు. మరో మూడేళ్ళ సమయం ఉంది కాబట్టి ఇకనైనా కేంద్రం ముంచి రావాల్సిన వాటి కోసం పోరాడాలి. ఏపీలో కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించాలి. అంతే తప్ప అప్పులు తెచ్చాం మీ కోసమే అంటే జనాలు ఏదో నాడు రివర్స్ అవడం ఖాయమే.

Related Posts