ఏలూరు, మార్చి 18,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఒక విషయంలో మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. ఆయన కష్టించే పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది. గ్లామర్ లేకపోయినా చంద్రబాబులో జనాలకు నచ్చింది కష్టపడేతత్వమే. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన నిత్యం ప్రజల్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తారు. కరోనా సమయంలో వయసు రీత్యా బయటకు రాలేకపోయి ఉండవచ్చు కాని, ఆయన క్షణం కూడా ఇంట్లో ఉండేందుకు ఇష్టపడరు. రాజకీయమే జీవితంగా పనిచేస్తారు.గత ఇరవై నెలలుగా చంద్రబాబును చూసిన ఎవరికైనా అయ్యో పాపం అనిపించక మానదు. ఎన్నికలలో ఓటమి పాలవుతున్నామని తెలిసీ ఆయన నిరంతరం పోరాడుతూనే ఉంటారు. 70 ఏళ్ల వయసులో పది గంటల పాటు తిరుపతి ఎయిర్ పోర్టులో ధర్నా చేయడం అంటే సామాన్య విషయం కాదు. తాను రాష్ట్రం కోసమే అని ఆయన చెబుతున్నా పార్టీ కోసం, తన కుటుంబం కోసమే కష్టపడుతున్నారు. కానీ మిగిలిన రాజకీయనేతలకు చంద్రబాబు పూర్తిగా భిన్నంగా కన్పిస్తారు.పదవుల్లో ఉంటే ఒకరకంగా, లేకుంటే మరో రకంగా రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయే నేతలు మన కళ్లముందు అనేక మంది ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీసుకుంటే ఉద్యమ సమయంలోనూ ఆయన పెద్దగా బయటకు వచ్చింది లేదు. ఇంట్లో ఉండి నడిపించారు. ఇక ముఖ్యమంత్రి అయ్యాక కూడా పెద్దగా ప్రజల్లోకి వచ్చి చేసింది లేదు. ప్రగతిభవన్ నుంచే పాలన సాగిస్తున్నారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా నిత్యం ప్రజల్లో ఉండేందుకే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు.ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ సయితం సీఎం అయ్యాక పెద్దగా జనంలోకి రావడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా కార్యాలయం నుంచే ముగించారు. కానీ చంద్రబాబు అలా కాదు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. సరే గెలుపోటములు పక్కన పెడితే చంద్రబాబు చెమటోడుస్తున్న తీరు మాత్రం ముచ్చటేస్తుంది. గెలిచినా, గెలవకపోయినా ఆయన పడుతున్న కష్టాన్ని మాత్రం పొగడకుండా ఉండలేం. ఆయన పాలనలో ఏం జరిగింది అన్నది చర్చ అనవసరం. ఇప్పుడు ఆయన పడే కష్టం భవిష్యత్ లో పార్టీకి మాత్రం లబ్ది చేకూరుస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు