విశాఖపట్టణం, మార్చి 18,
జేడీ లక్ష్మీనారాయణ అంటేనే జనాలకు తెలుస్తుంది. నిజానికి ఆయన అసలు పేరు వీవీ లక్ష్మీనారాయణ. సీబీఐలో జేడీగా పనిచేసి పదోన్నతి మీద మహారాష్ట్రాకు వెళ్ళినా ఆయన తెలుగు జనాలకు ఎప్పటికీ జేడీనే. ఆయన పలు రాజకీయ కేసులను చూడడం వల్ల వచ్చిన ఫోకస్ అది. ఇక జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల వేళ రాజకీయ అవతారం ఎత్తి విశాఖ ఎంపీగా జనసేన తరఫున పోటీ చేసి రెండున్నర లక్షలకు పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఆయనకు యూత్ లో బాగానే ఫాలోయింగ్ ఉంది. వెనక బలమైన కాస్ట్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. అందువల్ల ఈసారి పోటీ చేస్తే హిట్ అవడం ఖాయమని అంటున్నారు.జేడీ లక్ష్మీ నారాయణ మేధావి వర్గానికి చెందిన వారు. రాజకీయాల్లో ఆయన నిలదొక్కుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇక పార్టీ పెడదామనుకున్నా అనుకూలించని సీన్ ఏపీలో ఉంది. మరో వైపు చూస్తే సార్వత్రిక ఎన్నికలు జరిగి అపుడే రెండేళ్ళు గడచిపోయాయి. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారికి మిగిలిన కాలం అతి కీలకమైనది. అందుకే ఆయన చూపు జనసేన మీద పడింది అంటున్నారు. అయితే ఆయన సరిగ్గా ఆరు నెలల క్రితం వదిలేసిన పార్టీ జనసేన. మరిపుడు ఆయనే అక్కడకి వచ్చి వాలడం అంటే రాజకీయంగా సంచలనమే.తన చుట్టూ ఏ రకమైన అడ్డుగోడలు ఏవీ లేవని, పైగా తాను ఎవరినీ వ్యతిరేక భావజాలంతో చూడనని ఈ మధ్య ఒక మీడియా ఇంటర్వ్యూలో జేడీ లక్ష్మీనారాయణ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. అంటే తాను మళ్ళీ జనసేనలో చేరవచ్చు ఆయన బలమైన సంకేతాలు ఇచ్చేశారు అంటున్నారు. తనకు పవన్ తో కానీ ఎవరితో కానీ ఏ రకమైన వ్యక్తిగత విభేదాలు లేవని జేడీ లక్ష్మీనారాయణ చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. పైగా జనసేనలో ఉన్న నాయకులు అంతా తనను తరచూ కలుస్తూ ఉంటారని, ఆ బంధాలు కొనసాగుతున్నాయని కూడా చెప్పుకొచ్చారు.ఇక భూమి గుండ్రంగా ఉందని ఈ మాజీ పోలీస్ అధికారి నిరూపిస్తున్నారు. తాను వదిలేసి వచ్చిన పార్టీయే మళ్ళీ ముద్దు అంటున్నారు. ఇక విశాఖ నుంచి మరో మారు ఎంపీగా పోటీ చేయాలన్నది ఆయన కోరిక. దానికి సరైన పార్టీ జనసేన అని కూడా భావిస్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ ముందు చూస్తే వైసీపీ, టీడీపీ, బీజేపీ వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో వైసీపీలోకి ఆయన పిలిచినా వెళ్ళరు. దానికి కారణాలు కూడా అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్దామనుకుంటే వైసీపీ నుంచి కార్నర్ అవుతారు. బీజేపీ విషయానికి వస్తే జనసేనతో ఎటూ పొత్తు ఉంది. పైగా బీజేపీ కంటే ఏపీలో బెటర్ పొజిషన్ లో ఉన్న పార్టీ. దాంతో పాటు తాను గతంలో ఉన్న పార్టీ కావడంతో సులువుగానే అక్కడకి తిరిగి రావచ్చు అన్న నమ్మకంతోనే జేడీ లక్ష్మీనారాయణ పవన్ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. మరి పవన్ రా రమ్మని పిలిస్తే చాలు ఈ మాజీ పోలీస్ సార్ జనసైనికుడు అవుతారన్న మాటేగా.