విజయవాడ, మార్చి18,
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి అని భావిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యే క్రమంలో మహిళా నేతల విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదు. తెలంగాణలో మహిళా నేతలు బీజేపీ కోసం కాస్త ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మహిళా నేతలు ఎవరూ కూడా కనబడటంలేదు. దగ్గుబాటి పురంధరేశ్వరి మాత్రమే ఉన్నారు.ఏపీలో బిజెపికి మహిళా నేతలు ఎవరు ఏంటి అనేది కూడా తెలియదు. ఇతర పార్టీల నుంచి కూడా మహిళా నేతలను ఆహ్వానించే ప్రయత్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గాని బిజెపి లో ఉన్న ఇతర నేతలు గానీ పెద్దగా చేయడం లేదు. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న మహిళా నేతలను ఆహ్వానించి వాళ్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా బిజెపి నేతలు చేయలేక పోతున్నారు.దీనితో బీజేపీ మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకోలేక పోతుంది అనే భావన ఉంది. మహిళా నాయకత్వం ఉంటే మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయవచ్చు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏపీ బీజేపీలో పెద్దగా కనపడటం లేదు. ఇతర పార్టీలలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న సరే… బీజేపీలో మాత్రం ఎంతసేపు సోము వీర్రాజు విష్ణువర్ధన్రెడ్డి లేకపోతే భాను ప్రకాష్ రెడ్డి వంటి వారు మాత్రమే మీడియాలో కనబడుతుంటారు. అప్పుడప్పుడు బిజెపి రాజ్యసభ ఎంపీలు హడావుడి చేస్తూ ఉంటారు. మరి మహిళా నేతలను ఆ పార్టీ ఎప్పుడు ముందుకు తీసుకొస్తుంది ఏంటి అనేది చూడాలి.