హైదరాబాద్, మార్చి 18,
విద్యుత్ రంగంలో దూసుకుపోతున్నామని రాష్ట్ర సర్కారు చెప్తున్నా.. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కరెంటు ఉత్పత్తి కంటే.. కొనుడే ఎక్కువగా ఉంటోంది. ఐదేండ్ల కిందట ప్రారంభించిన భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణ పనులను ఇప్పటికీ పూర్తి చేయలేదు. మరోవైపు శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంతో కరెంట్ ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. ఏడు నెలలు అవుతున్నా రెండు యూనిట్లలో రిపేర్లు ఇంకా పూర్తికాలేదు. ఇలా మన పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి పెంపు గురించి పట్టించుకోని రాష్ట్ర సర్కారు.. బయటి నుంచి కొనడంపైనే దృష్టిపెడుతోంది. దీంతో కరెంటు కొనుగోళ్ల కోసమే సగటున రోజూ రూ.80 కోట్లు ఖర్చు చేస్తోంది. ఎండలు పెరిగి, కరెంటు వాడకం ఎక్కువైతే ఈ మొత్తం 100 కోట్లకు చేరే అవకాశం ఉంది.ఈ నెల ప్రారంభం నుంచి రోజువారీగా 255 మిలియన్ యూనిట్ల నుంచి 269 మిలియన్ యూనిట్లకు పైగానే కరెంటు వాడకం జరుగుతోంది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కరెంట్ కంటే మూడు రెట్లు ఎక్కువగా బయటి నుంచి కొంటున్నారు. ఈ నెల 11న అత్యధికంగా 269.79 మిలియన్ యూనిట్లు వాడగా, 12న 266.07 ఎంయూలు, 13న 262.94 ఎంయూలు, 14న 260.93 ఎంయూలు, 15న 267.38 ఎంయూల విద్యుత్ వాడకం జరిగింది. కానీ జెన్‌కో థర్మల్, హైడల్ పవర్ ప్లాంట్లు అన్నీ కలిపి గత ఐదు రోజుల్లో డైలీ 77.48 ఎంయూల నుంచి 83.12 ఎంయూల వరకే కరెంటు ఉత్పత్తి చేశాయి. దీంతో నాలుగు రోజులుగా సింగరేణి నుంచి 13.20 ఎంయూల నుంచి 17.20 ఎంయూల వరకు, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ (ఎన్‌సీఈ) సంస్థల నుంచి 27.54 ఎంయూల నుంచి 30.89 ఎంయూల వరకు ట్రాన్స్కో కొన్నది. సెంట్రల్ పవర్ జనరేషన్ స్టేషన్ల నుంచి 141.04 ఎంయూల నుంచి 153.99 ఎంయూల వరకు కొన్నది. జెన్‌కో నుంచి కాకుండా ఇలా ఇతర సంస్థల నుంచి ఐదు రోజుల్లో రోజువారీగా 181 ఎంయూలు నుంచి 198 ఎంయూల వరకు కరెంట్ను ట్రాన్స్‌కో కొని సరఫరా చేసింది. ఈ లెక్కన రాష్ట్రంలో మిగులు విద్యుత్ అన్నది ఉత్తమాటే.ఎండాకాలం కావటంతో రాష్ట్రమంతటా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం పుంజుకుంటోంది. దీంతో కరెంట్ డిమాండ్అంతకంతకూ పెరుగుతోంది. కానీ రాష్ట్రంలో ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి కావటం లేదు. దీంతో ఈ నెల ప్రారంభం నుంచి సగటున రోజూ 180 మిలియన్ యూనిట్లకు పైగా కరెంటును జెన్కో కొంటోంది. యావరేజీగా ఒక యూనిట్విద్యుత్ కొనాలంటే రూ.4.4 నుంచి రూ.5.4 ఖర్చవుతుంది. సరఫరా ఖర్చు అదనం. ఈ లెక్కన రోజూ అంత భారీ మొత్తంలో కరెంట్ కొనాలంటే రూ.80 కోట్ల నుంచి దాదాపు రూ.100 కోట్లు ఖర్చవుతోంది.శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు ప్రమాదంతో జెన్‌కో ఉత్పత్తి మరింత తగ్గింది. గత ఆగస్టు 20న 900 మెగావాట్ల శ్రీశైలం ప్రాజెక్టులో అగ్ని ప్రమాదం జరగడంతో జెన్‌కో హైడల్ పవర్‌పై ఎఫెక్ట్ పడింది. రోజూ 21.6 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్టు నుంచి హైడల్ పవర్ జనరేషన్ తగ్గింది. 6 యూనిట్లలో 2 యూనిట్లు భారీగా దెబ్బతినగా, మిగతా 4 యూనిట్లను తిరిగి ప్రారంభించారు. అయినా రోజుకు ఒక్క మిలియన్ యూనిట్ ఉత్పత్తికే కష్టమవుతోంది.