హైదరాబాద్, మార్చి 18, డీపీ అధినేత చంద్రబాబుకు మేనల్లుడు, తాత ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తెలుగు తెరపై దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశం గురించి ఎప్పుడూ హాట్ టాపిక్ హల్ చల్ చేస్తూనే ఉంది. ఆయన టీడీపీలోకి రావాలని.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరుకునే వారు ఎక్కువ మందే ఉన్నారు. అయితే.. ఈ విషయంలో ఎప్పుడూ కూడా జూనియర్ ఎన్టీఆర్ నోరు విప్పలేదు. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటించినప్పుడు కూడా అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ మాట వినిపించింది. అయితే.. ఈ విషయంలో చంద్రబాబు కూడా మౌనం పాటించారు.జూనియర్ ఎన్టీఆర్ విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే.. ఆయనను చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుని వదిలేస్తున్నారనే భావన జూనియర్ ఎన్టీఆర్ అభిమాన వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. 2009లో జరిగిన ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో జూనియర్ ఖాకీ దుస్తులు ధరించి మరీ ఎన్నికల్లో ప్రచారం చేసి పెట్టారు. తర్వాత ఓ ప్రమాదానికి కూడా గురయ్యారు. అయితే.. ఆ ఏడాది టీడీపీ అధికారంలోకి రాలేదు. ఇక, ఆ తర్వాత జూనియర్‌ను చంద్రబాబు పక్కన పెట్టారు.అంతేకాదు.. అప్పటి వరకు మహానాడుకు ప్రాధాన్యం ఉన్న వ్యక్తిగా ఆహ్వానం పంపిన చంద్రబాబు తర్వాత తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానమే పంపలేదు. అంతేకాదు.. ఆయనేమన్నా నాయకుడుగాప్రత్యేకంగా ఆహ్వానం పంపించేందుకు అనే కామెంట్లు కూడా వినిపించాయి. దీనికితోడు.. జూనియర్ ఎన్టీఆర్ ను పెద్దగా పట్టించుకోలేదు. మరీ ముఖ్యంగా 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబు తన కుమారుడిని నాయకుడిని చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు తప్ప.. జూనియర్ ఎన్టీఆర్ ను అస్సలు పట్టించుకోలేదు.ఇక, కుటుంబం పరంగా చూసుకున్నా.. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి.. హరికృష్ణకు కూడా అవకాశ వాదంగా చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారని.. జూనియర్ భావిస్తున్నారు. ఆయనను కూడా వాడుకుని వదిలేశారనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ముఖ్యంగా టీడీపీలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదనేది విశ్లేషకుల భావన. దీనికితోడు ప్రస్తుతం ఆయన వెండితెరపై హీరోగా సక్సెస్ ఫుల్ రేంజ్‌లో కొనసాగుతున్నారు. ఈ సమయంలో దీనిని వదిలి పెట్టి.. రాజకీయాల్లోకి రావడం వల్ల కెరీర్ దెబ్బతింటుందని కూడా జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఇక, చంద్రబాబు పరంగా చూసుకున్నా.. పార్టీ నష్టపోయినా ఫర్వాలేదు తప్ప.. జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం ఆహ్వానించే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే..జూనియర్ రాకతో.. చంద్రబాబు తన కుమారుడిని తనే రాజకీయాల్లో తొక్కేసినట్టు అవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. ప్రధానంగా ప్రజాభిమానం.. భారీ ఎత్తున అభిమాన జనం.. మాటకారి.. అయిన జూనియర్ ఎన్టీఆర్ ముందు..లోకేష్ ఏ దశలోనూ పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఈక్వేషన్ల కారణంగానే జూనియర్ దూరంగా ఉన్నారని.. ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు.