న్యూఢిల్లీ, మార్చి 18, కాంగ్రెస్ ను కాపాడుకునేందుకు అన్నాచెల్లెళ్లు విపరీతంగా శ్రమిస్తున్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రధాన ప్రచారకర్తలుగా మారారు. ఇద్దరూ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కాంగ్రెస్ ను ఇబ్బందులు పెట్టాలని సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నా రాహుల్, ప్రియాంకలు పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ దృష్టంతా ప్రచారంపైనే పెట్టారు.ఇప్పటికే రాహుల్ గాంధీ దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. త్వరలో జరగనున్న పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పలు విడతలుగా ప్రచారాన్ని నిర్వహించారు. తమిళనాడు లో డీఎంకే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేరళలోనూ కొద్దిగా శ్రమిస్తే కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశముంది. అందుకే ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు.ఉత్తరాది రాష్ట్రాలైన అసోం, పశ్చిమ బెంగాల్ లో ఈసారి కాంగ్రెస్ కు అసోంపైనే ఎక్కువ హోప్స్ ఉన్నాయి. అందుకే అసోంపై ప్రియాంక గాంధీ ఎక్కువగా పర్యటిస్తున్నారు. అక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారు. 126 స్థానాలున్న అసోం ను ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. అందుకే అక్కడ సోదరి ప్రియాంక గాంధీని రంగంలోకి దించారు. తాను కూడా అక్కడ పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్నారు.పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ కు అవకాశాలు తక్కువ అనే చెప్పాలి. అక్కడ కమ్యునిస్టులతో కలసి కాంగ్రెస్ పోటీ బరిలోకి దిగింది. త్వరలోనే రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్నారు. ఇక్కడ గెలవలేకపోయినా కనీస స్థాయిలో పెర్ ఫార్మెన్స్ చూపాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. బీజేపీ ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా అధికారంలోకి రాకుండా ఉంటేనే కాంగ్రెస్ కు రానున్న కాలంలో ఇమేజ్ పెరుగుతుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ప్రచార బాధ్యతలన్నీ అన్నా చెల్లెళ్లు తమ భుజానకెత్తుకున్నారు.