హైదరాబాద్ మార్చ్ 18
కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి..మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు మార్కెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వేదికగా వెలుగు చూసిన వైరస్ తాజాగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్దిరోజులుగా చాలాచోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒకరి తర్వాత మరొకరు వైరస్ బారినపడుతున్నారు. రెండు రోజుల క్రితం బండ్లగూడ మైనార్టీ రెసిడెన్షి యల్ స్కూల్లో 38 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, తాజాగా బుధవారం కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో 20 మంది విద్యార్థులతో పాటు నాగోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రులే కాకుండా ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో వైరస్ నిర్ధారణ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం గతేడాది జూన్ నుంచి లాక్‌డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వచ్చింది. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో పాటు హోటళ్లు, పార్కులు, ఇతర దర్శనీయ ప్రదేశాల్లోకి ప్రజలను అనుమతించారు. దీంతో జనం బయటకు రావడం బాగా పెరిగింది. ఇక వ్యాక్సిన్ సైతం ఇస్తుండడంతో ప్రజలు స్వీయ నియంత్రణను పూర్తిగా విస్మరిస్తున్నారు. సినిమాలు, విందులు, వినోదాల పేరుతో పెద్ద సంఖ్యలో ఒకచోట పోగవుతున్నారు. మరోవైపు మాస్కులు, శానిటైజేషన్, భౌతికదూరం నిబంధనలూ గాలికొదిలేశారు. దీంతో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 301769 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో రెండు లక్షల కేసులు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నాయి. అంతేకాదు 1659 మంది మృతుల్లో వెయ్యి మందికిపైగా సిటీజనులే. ప్రస్తుతం 2101 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 958 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 60 శాతం మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుండగా, 40 శాతం మంది సాధారణ ఆక్సిజన్‌పై చికి త్స పొందుతున్నారు. ప్రస్తుతం గాంధీలో 63 మంది, టిమ్స్‌లో 75 మంది, కింగ్‌కోఠిలో 73 మంది చికి త్స పొందుతున్నారు. మిగిలిన వారంతా అపోలో, యశోద, కేర్, మెడికవర్, సన్‌షైన్, కిమ్స్, ఏఐజీ వంటి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందున్నారు.
అధికారికంగా ప్రకటించిన నివేదిక ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో గత వారంలో రోజుల్లో 511 కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 278, రంగారెడ్డి జిల్లాలో 104, మేడ్చల్ జిల్లాలో 129 కేసులు వెలుగుచూశాయి. ఇక అనధికారికంగా లెక్కిస్తే ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ప్రతిరోజు 150కి పైనే కరోనా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మంది కరోనా వైరస్‌ను కూడా సాధారణ జ్వరంగా భావించి టెస్టింగ్, ట్రీటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరించేందుకు కారణమవుతున్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ..మాస్కులు ధరించాలి. శానిటైజేషన్..భౌతికదూరం నిబంధనలు పాటించాలి. వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి.ప్రస్తుతం సీజన్ మారింది. చలి పోయి ఉక్కపోత మొదలైంది. వాతావరణంలో చోటు చేసుకున్న ఈ మార్పులతో అనేక మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా వైరస్‌లోనూ ఇవే లక్షణాలు కన్పిస్తాయి. ఫలితంగా ఎవరికి కరోనా ఉందో? మరెవరికి రానుందో? గుర్తించడం వైద్యులకూ ఇబ్బందిగా మారింది. దగ్గు, జలుబు, జ్వరంతో పాటు ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వైరస్‌ను లైట్‌గా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి సూచించారు.
కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఘోరంగా విఫలం అవుతున్నారు. అనుమానంతో పీహెచ్‌సీలకు వచ్చే వారికి టెస్టులు చేయడం మినహా ఆ తర్వాత ఎలాంటి ఫాలోఅప్‌లు చేయడం లేదు. వైరస్ ఎంటరైన మొదట్లో ఇంట్లో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయితే ఆ ఇంటికి సమీపంలో ఉన్న వీధుల్లోకి వెళ్లే దారులన్నీ మూసివేసి, ఇంటింటికి తిరిగి స్క్రీనింగ్ చేసేవారు. వైరస్ నిర్ధారణ అయిన వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి చికిత్స చేసేవారు. వైద్య ఆరోగ్యశాఖ ప్రస్తుతం కేసుల ట్రేసింగ్‌ను పూర్తిగా విస్మరించింది. కంటైన్మెంట్ జోన్ల పద్ధతిని కూడా పూర్తిగా ఎత్తేసింది. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారిపై నిఘా కూడా లేదు. వారంతా మందులు, మార్కెట్ల పేరుతో ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నారు. వైరస్‌ను అంతా లైట్‌గా తీసుకుంటుండటంతో అది ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తోంది.