విజయవాడ, మార్చి 19,
చంద్రబాబు అంటే జగన్ కి అసలు పడదు కదా. మరి ఈ ఇద్దరినీ ఒకే చోటకు చేర్చడం కుదురుతుందా అంటే ఎందుకు కుదరదు అనుకున్నారో ఏమో ప్రధాని నరేంద్ర మోడీ 75 ఏళ్ళ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఏర్పాటు చేసిన జాతీయ సన్నాహక కమిటీలో ఇద్దరికీ చోటిచ్చేశారు. వర్చువల్ విధానంలో మీటింగులు జరిగినా లేక డైరెక్ట్ గానే సమావేశాలు నిర్వహించినా ఇక మీదట చంద్రబాబు జగన్ ఒకే సమావేశంలో కలసి కనిపిస్తారు అన్న మాట.చంద్రబాబు మోడీ కంటే తాను సీనియర్ అని అన్నారు. మోడీకి పాలన ఏమీ తెలియదు అని పెద్ద మాటలే వాడారు, సంసార బంధాలు, బాంధవ్యాల విలువ తెలిసిన మనిషి కాదు అని కూడా అన్నారు. ఏపీకి ప్రధాని హోదాలో మోడీ వస్తే నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలూ చేశారు. ఇన్ని చేసినా మోడీ మాత్రం ఇపుడు చంద్రబాబు రాజకీయ సీనియారిటీని గుర్తించినట్లున్నారు. అందుకే జాతీయ కమిటీలో స్థానం కల్పించి ఈ కష్ట సమయంలో ఒక గుర్తింపు ఇచ్చారు. ఏపీలో కాస్తా తలెత్తుకునేలా విలువ కూడా ఇచ్చారనుకోవాలి.ఇక 2022 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తి అవుతాయి. ఆనాటికి ఏ విధంగా ఉత్సవాలు నిర్వహించాలి అన్నది ఈ కీలకమైన జాతీయ కమిటీ నిర్ణయిస్తుంది. ఇందులో ఎంతో మంది ప్రముఖులు ఉన్నా ఏపీ నుంచి చూసినపుడు జంటగా చంద్రబాబు, జగన్ కనిపిస్తున్నారు. జగన్ పదేళ్ల రాజకీయ జీవితంలో బాబుతో కలసి ఇలాంటి ఏ వేదికా కూడా పంచుకోలేదు. బాబు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జగన్ ని అసలు పట్టించుకునేవారు. కారు, ఇపుడు జగన్ సీఎం అయినా అదే పాటిస్తున్నారు. అటువంటి ఇద్దరు నేతలూ జాతికి గర్వకారణమైన అతి ముఖ్యమైన అంశానికి సంబంధించి తమ విలువైన సలహా సూచనలు ఇచ్చే కమిటీలో జంటగా కనిపించడం మాత్రం ఏపీ రాజకీయాల్లో కొత్తగానే ఉంది.ఇక ఏపీకి సంబంధించి కూడా బాబు జగన్ ఒకే వేదిక మీద నిలబడితే రాష్ట్రంలోమి చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అనే వారూ ఉన్నారు. ఈ ఇద్దరు నేతలూ వ్యక్తిగత వ్యవహారాలు పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం చేతులు కలిపితే బాగుంటుంది అని ఇప్పటికే మేధావుల నుంచి కూడా సూచనలు ఉన్నాయి. ఎడ్డెమంటే తెడ్డేమనే ప్రభుత్వ నేత, ప్రతిపక్ష నేత ఉంటే అయిదు కోట్ల జనాభా కలిగిన ఏపీ అన్ని విధాలుగా నష్టపోతుంది. ఇకనైనా చంద్రబాబు పెద్ద మనసు చేసుకుని తన రాజకీయ అవతారం నుంచి పరిణతి చెందిన రాజకీయవేత్తగా రూపాంతరం చెందాలి. జగన్ సైతం వైసీపీ అధినేత స్థాయి నుంచి రాష్ట్రాధినేతగా తన పెద్దరికాన్ని చాటుకోవాలి. అది జరిగేందుకు మోడీ కలిపిన ఈ బంధం ఉపయోగపడితే చాలా బాగుణ్ణు అన్న మాట అందరిలో వినిపిస్తోంది.