మానసికంగా బాబు బ్లాక్ మెయిల్
విజయవాడ, మార్చి 19,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మానసికంగా వీక్ అయ్యారా? పార్టీ నేతలే ఆయనను బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. ప్రధానంగా ఇరవై నెలలుగా చంద్రబాబును కొందరు టీడీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ పార్టీ నేతలే ఆరోపిస్తుండం విశేషం. నిజానికి చంద్రబాబు ఎప్పుడూ బలవంతుడు కాదు. పార్టీలో నిర్ణయం కూడా ఆయన గట్టిగా తీసుకోలేరు. ఒక నిర్ణయం తీసుకోవాంటే నాన్చి నాన్చి తీసుకుంటారు.అలాంటిది ఇటీవల చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు నేతల బ్లాక్ మెయిల్ కారణంగానే అని పార్టీ నేతలు చెబుతున్నారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన హాట్ కామెంట్స్ ఇవి. విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేయడం వల్లనే ఆయన కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారంటున్నారు. ఉన్న కొద్ది మంది నేతలు పార్టీని వీడకుండా చంద్రబాబు తీసుకుంటున్న అతి జాగ్రత్తల వల్లనే నేతలు హెచ్చరికలతో తమ పని కానిచ్చేసుకుంటున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి.గతంలో ఉన్న చంద్రబాబుకు, ఇప్పటి చంద్రబాబుకు చాలా తేడా ఉంది. పార్టీ పరిస్థితి కూడా అంతే. భవిష‌్యత్ లో కనుచూపు మేరలో పార్టీ పదవులు తప్ప మరే పదవులను నేతలకు ఇచ్చే అవకాశం లేదు. అదే చంద్రబాబు బలహీనతగా మారింది. కేవలం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో భవిష్యత్ లో ఖాళీ కానున్న శాసనమండలి, రాజ్యసభ పదవులను టీడీపీ దక్కించుకునే అవకాశం లేదు. కనీసం ఒక్క స్థానం దక్కించుకునే అవకాశం ఉన్నా చంద్రబాబుకు ఈ దయనీయమైన పరిస్థితి దాపురించేదికాదు.అందుకే నేతలు కూడా చంద్రబాబును లైట్ గా తీసుకుంటున్నారంటున్నారు. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా ఒక సామాజికవర్గం వారికే ఇవ్వడం చంద్రబాబు ఎప్పుడూ చేయలేదు. కానీ ఈసారి తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నారని, అందుకు ఒక కారణం ఆర్థికమైనది కాగా, మరొకటి బ్లాక్ మెయిల్ వల్లనేనన్న టాక్ పార్టీలో వినిపిస్తుంది. చంద్రబాబును నేతలు లెక్క చేయకపోవడానికి కూడా కారణం ఎలాంటి పదవులు భవిష్యత్ లో దక్కవన్నదే. అందుకే కొందరు నేతలు చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసి మరీ తమ పనిని చక్కబెట్టుకుంటున్నారంటున్నారు.