ఆది శంకరుని స్ఫూర్తితోనే పరివ్రాజకం
- స్వామి స్వాత్మానందేంద్ర
- అన్నవరం చేరిన హిందూ ధర్మ ప్రచార యాత్ర
అన్నవరం మార్చి 19
విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర అన్నవరం పుణ్యక్షేత్రానికి చేరింది. ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం అనంతలక్ష్మీ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. సత్యదేవునికి శ్రీసూక్తం, పురుషసూక్త విధానంలో విశేష అర్చనలు నిర్వహించారు. అలాగే నీరాజన మంత్ర పుష్పాలను సమర్పించారు. అనంతరం సత్యనారాయణ స్వామి పాదుకలను దర్శించారు. స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామికి అన్నవరం దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలు చేశారు. సత్యనారాయణ మూర్తి ప్రసాదాన్ని సమర్పించారు. అన్నవరం పండితులకు స్వామీజీ ఆశీర్వచనం అందించారు. జగద్గురు శంకరాచార్య సాంప్రదాయాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం అనుసరిస్తోందని తెలిపారు. ఆయన మార్గంలోనే పరివ్రాజకం చేస్తున్నామని స్పష్టం చేసారు. అందులో భాగంగానే హిందూ ధర్మ ప్రచార యాత్ర నిర్వహిస్తున్నట్లు వివరించారు. అన్నవరం పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో హిందూ ధర్మ ప్రచార యాత్ర విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. స్వామీజీ హిందూ ధర్మ ప్రచార యాత్రకు అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ శర్మ, ఈవో త్రినాథ్ స్వాగతం పలికారు
గోశాలను సందర్శించిన స్వామీజీ
అన్నవరంలో రత్నగిరి దిగువన ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ సహిత ఉచ్ఛిష్ట గణపతి మహాకాళీ పీఠాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సందర్శించారు. పీఠం నిర్వహణలోని గోశాలకు వెళ్ళారు. కపిల గోవులతో పాటు మేలు జాతి ఆవులను చూసి ఆనందం వ్యక్తం చేశారు. గోశాల నిర్వహణ తీరు బాగుందని నిర్వాహకులను ప్రశంసించారు.