ధ్యానారామంలో శాస్త్రోక్తంగా మృల్లింగార్చన
తిరుమల, మార్చి 19
టిటిడి చేపట్టిన ఫాల్గుణ మాస ఉత్సవాల్లో భాగంగా షష్ఠి తిథిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆవరణలో గల ధ్యానారామంలో మృల్లింగార్చన జరిగింది. ఈ సందర్భంగా మృల్లింగానికి అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన నిర్వహించారు. అనంతరం మృల్లింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పంచామృతాలతో, నమక, చమక మంత్రసహితంగా అభిషేకించారు. ఫాల్గుణ మాసం షష్ఠి రోజున మట్టితో చేసిన శివలింగాని అభిషేకించడం వలన లోక కల్యాణం, ప్రపంచంలోని సకల జీవులకు శుభఫలితాలను ఇస్తుందని వరాహపురాణంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవికి వివరించానట్లు పండితులు తెలిపారు.