YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఐడీ కేసులపై వాడీ వేడి వాదనలు

సీఐడీ కేసులపై వాడీ వేడి వాదనలు

సీఐడీ కేసులపై వాడీ వేడి వాదనలు
విజయవాడ, మార్చి 19,
టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ తరపున ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. సీఆర్డీఏ చట్టం ద్వారా తీసుకువచ్చిన జీవో చెల్లదనటం సరికాదని, ఐపీసీలోని సెక్షన్‌ 166, 167 ఈ ఫిర్యాదుకు వర్తించవన్నారు. ఉన్నతాధికారుల లిఖితపూర్వక ఆదేశాలను ఉల్లంఘిస్తే ఈ సెక్షన్ల కింద కేసు పెట్టాలని, అలాంటి ఆదేశాలు ఇక్కడ లేవని ఉన్నత న్యాయస్థానానికి న్యాయవాది సిద్దార్థ లూథ్రా తెలిపారు. ఫిర్యాదులోని ఆరోపణలకు..పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. జీఓ విడుదలైన 35 రోజుల తర్వాత దానిని సీఎం ఆమోదించారని.. విచారణ నివేదికలోనే చెబుతున్నారన్నారు. అలాంటప్పుడు సీఎంకు తెలిసి జీఓ ఇచ్చారని ఎలా చెబుతారన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఈ ఫిర్యాదులో కేసు నమోదు చేయటం కుదరదని, ఇక్కడ నష్టపోయిన వ్యక్తులు ఫిర్యాదు చేయలేదని, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రి ఎక్కడా ఈ ప్రక్రియలో పాల్గొనలేదన్నారు. అలాంటప్పుడు ఎస్సీ, ఎస్టీ చట్టం ఎలా వర్తిస్తుందన్నారు. నారాయణ తరపున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్‌ విజ్ఞప్తి మేరకు జీఓను సవరించారని, జీవోకు సంబంధించిన చర్చలు, విడుదల చేసే ప్రక్రియలో గాని.. అప్పటి సీఎం, మంత్రి పాల్గొనలేదని దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. జీవో విడుదలయ్యాక మాత్రమే ఆమోదానికి పంపారని, వ్యక్తిగతంగా వెళ్లి అసైన్డ్‌ రైతుల ల్యాండ్‌ తీసుకుని.. వారిని నష్టపరిస్తే ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లు వర్తిస్తాయని దమ్మాలపాటి అన్నారు. ఒక జీవో ద్వారా లబ్దిదారులకు ప్రయోజనం కల్పించి.. భూములు తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ కేసు ఎలా పెడతారన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం భూములు తీసుకొనే సమయంలో.. అప్పటి ప్రభుత్వం అన్నివర్గాలకు లబ్ది చేకూర్చిందన్నారు. దాని ప్రకారమే భూములు సమీకరించారన్నారు. 
మా భూములు ఎవ్వరూ లాక్కొలేదు
రాజధాని అసైన్డ్‌ భూములపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సీఐడీ విచారణ చేపట్టింది. ఈ విచారణకు పలువురు రాజధాని దళిత రైతులు హాజరయ్యారు. తమ భూముల్ని రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చామన్న రైతులు స్పష్టం చేశారు. తమ భూముల్ని ఎవరూ లాక్కోలేదని, బెదిరించలేదని రైతులు తెలిపారు. ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందిందని రైతులు స్పష్టం చేశారు. భూముల విషయంలో నష్టపోయామని ఫిర్యాదు చేసిన కొందరి రైతుల వివరాలను కూడా సేకరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అమరావతి దళిత జేఏసీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై అట్రాసిటీ కేసులు పెట్టడమంటే.. ఎస్టీ, ఎస్సీ చట్టాలను దుర్వినియోగం చేసినట్లేనని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 41 జీవో ద్వారా చంద్రబాబు దళితుల అభివృద్ధికి పాటుపడితే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ హక్కు ప్రకారం ఎస్టీ, ఎస్సీ కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను వెనక్కితీసుకోవాలని లేని పక్షంలో ఆళ్లపై అట్రాసిటీ కేసులు పెడతామని దళిత జేఏసీ నేతలు హెచ్చరించారు. మరోవైపు అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ అధికారులు దూకుడుపెంచారు. రాజధాని అసైన్డ్‌ భూముల అంశంలో సీఐడీ దాఖలు చేసిన కేసులో అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. అప్పటి గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌, సీఆర్డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను సీఐడీ అధికారులు పిలిపించారు. తాడేపల్లిలో శ్రీధర్‌ను అధికారులు విచారిస్తున్నారు. అప్పట్లో గుంటూరు, తుళ్లూరు రెవెన్యూ అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. రాజధాని అసైన్డ్‌ భూములపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత నెల 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు... శుక్రవారం (ఈనెల 12న) సీఐడీ కేసు నమోదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి 41(ఏ) సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. సీఐడీ అధికారులు రెండు బృందాలుగా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో నివాసంలోనే ఉన్న చంద్రబాబు నోటీసులు అందుకున్నారు.

Related Posts