YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

తమిళుల తెలుగు ఓటు ఎటు

తమిళుల తెలుగు ఓటు ఎటు

చెన్నై, మార్చి 20, 
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. అయితే ఈసారి తమిళనాడులో తెలుగు ప్రజల ఓట్లు ఎటు అన్న చర్చ ఆసక్తికరంగా జరుగుతుంది. తమిళనాడులోని కొన్ని నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు కీలకంగా మారారు. జయలలిత, కరుణానిధి ఉన్నప్పుడు ఒక సారి జయలలితకు, మరోసారి కరుణానిధికి తెలుగు ప్రజల మద్దతు లభించింది. ఈసారి వారిద్దరు లేకపోవడంతో ఈసారి తెలుగు ప్రజలు ఎవరి పక్షాన వహిస్తారన్నది సందేహంగా మారింది.తమిళనాడులో తెలుగు జనాభా ఎక్కువ. చెన్నైతో పాటు ప్రధానమైన పట్టణాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు. దాదాపు ముప్ఫయి నియజకవర్గాల్లో తెలుగు ప్రజలు ప్రభావం చూపనున్నారు. దీంతో డీఎంకే, అన్నాడీఎంకేలు తెలుగు ప్రజల ఓట్లను రాబట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించాయి. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తమిళనాడులో ఖచ్చితంగా చూపుతాయి. అక్కడ కూడా తెలుగు ప్రజలు తెలుగుదేశం, వైసీపీలుగా చీలిపోయారు.అందుకే డీఎంకే, అన్నాడీఎంకేలు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మద్దతు కోరనున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి డీఎంకే అధినేత స్టాలిన్ హాజరయ్యారు. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధితో కలసి జగన్ నివాసంలో లంచ్ కూడా చేశారు. ఈ పోస్టర్లను డీఎంకే వినియోగించుకుంటుంది. అలాగే గత ఏడాది ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీతో విభేదించి బయటకు వచ్చినప్పుడు స్టాలిన్ ను కలసి చర్చించారు. ఈ ఫొటోలను కూడా డీఎంకే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చోట వినియోగించుకుంటుంది.అధికార పార్టీ అన్నాడీఎంకే పార్టీ సయితం తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి పళనిస్వామి పాల్గొన్న బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భారీ కటౌట్ ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉండటం, వైఎస్ జగన్ బీజేపీకి పరోక్షంగా మద్దతు ప్రకటిస్తుండటం, చంద్రబాబు సయితం బీజేపీతో సఖ్యత ఉండటంతో తెలుగు ప్రజల్లో అత్యధికులు తమ పక్షాన నిలుస్తారని అన్నాడీఎంకే భావిస్తుంది. మొత్తం మీద తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలు తెలుగు ప్రజల ఓటు బ్యాంకు పైనే దృష్టి పెట్టారు. మరి ఎవరి పక్షాన వారు నిలుస్తారన్నది మాత్రం ఫలితాల తర్వాతనే తెలియనుంది.

Related Posts