విజయవాడ, మార్చా 20,
తెలివి ఒక్కడి సొత్తు కాదు అని వెనకటికి ఒక సామెత ఉండేది. తాను ఇంద్రుడు చంద్రుడు అని అనుకూల మీడియా చేత కీర్తింపచేసుకున్న చంద్రబాబు సైతం జగన్ రాజకీయ మేధస్సును చూసి ఆశ్చర్యపోతున్న పరిస్థితి. తాను ఒక్కడూ సీఎం గా ఉండాలని, అందరూ తన చుట్టూ తిరగాలని బాబు అనుకున్నారు, అందుకే ఆయన కుర్చీకే నేతలు చివరికి ఎసరు పెట్టేశారు. 2019 ఎన్నికల్లో మనస్పూర్తిగా పనిచేయకపోవడంతో టీడీపీ ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే. అదే జగన్ అందరికీ పదవులు అంటూ రాజకీయ కార్యకర్తలకు వరసబెట్టి పందేరాలు అందిస్తున్నారు.జగన్ అధికారంలోకి వచ్చాక కార్యకర్తలలు పదవులు దండీగా ఇస్తున్నారు. ఆ మధ్యన బీసీలకు కులానికో కార్పోరేషన్ అంటూ వందల కొద్దీ పదవులు పంచిన జగన్ ఇపుడు స్థానిక ఎన్నికల్లో సైతం పదవులను ఎక్కువగా ఎలా పంచవచ్చునో అమలు చేసి చూపిస్తున్నారు. సాధారణంగా మునిసిపాలిటీకి ఒక వైఎస్ చైర్మన్ ఉంటారు. అలాగే కార్పొరేషన్ కి ఒక డిప్యూటీ మేయర్ ఉంటారు. కానీ జగన్ మాత్రం వాటిని రెండుగా చేశారు. దీని వల్ల అటు రాజకీయంగా లాభం దక్కుతుంది. ఇటు సామాజికవర్గాలకు కూడా న్యాయం చేసినట్లు అవుతుంది. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇపుడు లోకల్ బాడీస్ లో ఇద్దరు డిప్యూటీలు అంటూ జగన్ సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టారు.ఇక మేయర్లు, చైర్ పర్సన్ పదవులకు కూడా రెండున్నరేళ్ళ కాలపరిమితిని విధించారు. అంటే అయిదేళ్ళ టెర్మ్ లో ఇద్దరు ఉన్నతమైన కుర్చీలో కూర్చుంటారు అన్న మాట. అదే విధంగా నలుగురు డిప్యూటీలకు చాన్స్ వస్తుంది. ఇలా అన్ని వర్గాలకు, సామాజికపరంగా అవకాశం దక్కుతుంది. మరో వైపు చూస్తే రాష్ట్ర మంత్రి వర్గానికి కూడా జగన్ ఇదే ఫార్ములాను అనుసరించారు. దీని వల్ల ఎక్కువ మందికి పదవులు దక్కడమే కాకుండా అధినాయకుడు కూడా తమ పట్ల అభిమానం చూపించాడన్న ఆలోచన కూడా అటు పార్టీలోని నాయకులకు, ఇటు క్యాడర్ కి కలుగుతుంది. మొత్తం మీద చూస్తూంటే జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా వైసీపీ మరింతగా పటిష్టం అవుతుంది అంటున్నారు.ఇక చంద్రబాబు తన హయాంలో లోకల్ బాడీస్ కి ఎన్నికలు ఒకే ఒకసారి నిర్వహించారు. అది కూడా 1999లో మాత్రమే. 2014 లో చేతిలో అధికారాన్ని పెట్టుకుని కూడా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఇక నామినేటెడ్ పదవుల పంపిణీ దగ్గరకు వచ్చేసరికి అనేక కూడికలూ తీసివేతలు వంటివి చూసుకుని చంద్రబాబు ఎప్పటికపుడు జాబితాలను పక్కన పెట్టేసేవారన్నది తెలిసిందే. దాంతో ఆయన హయాంలో క్యాడర్ పదవుల కోసం పడిగాపులు పడి చివరికి 2019 ఎన్నికల వేళ కాడె వదిలేసింది. మరి జగన్ వయసులో రాజకీయ అనుభవంలో చిన్న అయినా ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగానే చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా ఆయన్ని ఫాలో కావాల్సిందే అంటే అందులో తప్పేముంది అంటున్నారు.