తిరుపతి, మార్చి 20,
తిరుపతి పార్లమెంటు నియోజవర్గం ఉప ఎన్నికల్లో వైసీపీ తన అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ప్రకటించింది. ఇప్పుడు గురుమూర్తి పేరు ట్రెండింగ్ లో ఉంది. ఎవరీ గురుమూర్తి? ఎందుకు జగన్ ఆయనకు అంత పెద్ద పదవిని కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు? అన్నది పార్టీలోని కిందిస్థాయి నాయకత్వంలోనూ చర్చ జరుగుతోంది. గురుమూర్తి ఈ ఎన్నికల్లో విజయం సాధించడం నామమాత్రమేమనని వైసీీపీ నేతలు భావిస్తున్న సమయంలో ఆయనపై ప్రత్యేక కథనం.డాక్టర్ గురుమూర్తి మృదు స్వభావి. ఎవరైనా మాట్లాడితేనే బదులిస్తారు. ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటారు. డాక్టర్ గురుమూర్తి శ్రీకాళహస్తి నియజకవర్గంలోని ఏర్పేడు మండలంలోని మన్న సముద్రం గ్రామంలో జన్మించారు. ఆయన సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ పెద్దగా చదువుకోక పోయినా గురుమూర్తిని మాత్రం డాక్టర్ ను చేశారు. గురుమూర్తి బ్యాచిలర్ ఇన్ ఫిజియో థెరపీని పూర్తి చేశారు. ఫిజియో థెరపిస్టుగా గురుమూర్తికి మంచి పేరుంది.తొలి నుంచి డాక్టర్ గురుమూర్తి కాంగ్రెస్ అభిమానిగా ఉండేవారు. 2006 నుంచి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సంబంధాలను కొనసాగించారు. ఏపీ స్టేట్ ఫిజియోథెరపీ కౌన్సిల్ ను ఏర్పాటు చేసేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అనేకసార్లు కలిశారు. ఆయనతో జరిపిన చర్చల ద్వారా గురుమూర్తి వైఎస్ కు వీరాభిమానిగా మారిపోయారు. అనంతరం వైఎస్ జగన్ నాయకత్వం పట్ల ఆకర్షితులయ్యారు.అయితే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం అయింది వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సమయంలోనేే. జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకు ఫిజియోథెరపిస్టుగా గురుమూర్తి వ్యవహరించారు. జగన్ పాదయాత్ర నిరాటంకంగా ముగియడానికి పరోక్షంగా గురుమూర్తి ఉపయోగపడ్డారు. అయితే జగన్ అధికారంలోకి రాగానే ఆయనకు ఏదో ఒకపదవి ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అనుకోకుండా తిరుపతి ఎంపీ స్థానం ఖాళీ కావడంతో గురుమూర్తి ని జగన్ తన పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. చిన్న వయసులో పెద్ద పదవిని చేపట్టేందుకు గురుమూర్తి రెడీ అయిపోతున్నారు.