ముంబాయి మార్చి 20, నటుడు సోనూ సూద్ కరోనా సమయంలో రీల్ హీరో రియల్ హీరోగా మారిపోయాడు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అనేకమంది సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. తమవంతు సహాయాన్ని అందించారు. ఆయన చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూ సూద్ బొమ్మను వేశారు. ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూ సూద్ అనే క్యాప్షన్ వేశారు. ఇలా దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి. లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్, స్పైస్ జెట్ సంస్థ సంయుక్తంగా పూనుకుని 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు. రష్యా, ఉజెబికిస్థాన్, మనిల, ఇంకొన్ని దేశాల్లో చిక్కుకుపోయిన 1500 మంది భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చారు.