విశాఖపట్టణం, మార్చి 22,
పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ మెగా కుటుంబం నుంచి ఏ హీరో వచ్చినా కూడా తమ భుజాల మీద మోసే అభిమాన జనం విశాఖ నిండా ఉంది. ఆ ధైర్యంతోనే 2019 ఎన్నికలో పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేశారు. అయితే ఓట్లు బాగానే రాబట్టినప్పటికీ ఓటమిపాలు అయ్యారు. ఆ తరువాత నుంచి పవన్ కళ్యాణ్ విశాఖ మీద ఒక రకమైన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారని అంటారు. ఎన్నికలు జరిగిన అయిదు నెలల తరువాత లాంగ్ మార్చ్ అంటూ విశాఖ వచ్చిన పవన్ గాజువాకను ఒకసారి టచ్ చేశారంతే.
ఆ తరువాత నుంచి ఏణ్ణర్ధం అయింది కానీ పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ మాత్రం ఇప్పటికీ లేనే లేదు. అదిగో ఇదిగో అంటూ మొత్తానికి టైమ్ పాస్ చేస్తున్నారు. ఏపీలో టూర్లు మొదలు పెడితే అది విశాఖ నుంచే ఉంటుందని పవన్ కళ్యాణ్ అప్పట్లో నాయకులకు చెప్పినట్లుగా ప్రచారం అయితే సాగింది. ఆ తరువాత పవన్ రాయలసీమ వెళ్లారు, కృష్ణా గుంటూరు తిరిగారు కానీ ఈ వైపునకు మాత్రం కనీసం తొంగి చూడలేదు. పవన్ కళ్యాణ్ రాక కోసం జనసైనికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కరోనాతో గత ఏడాది ఎనిమిది నెలలు పోయినా ఆ తరువాత అయినా పవన్ కళ్యాణ్ ఇటు వైపు కన్నేయకపోవడంతో జనసైన్యం తీవ్రంగా నిరాశ పడుతోంది.ఏపీలో విశాఖ ప్రతిష్టాత్మకమైన నగరం. స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ కచ్చితంగా విశాఖ వస్తారని జనసేన నాయకులు చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ కనుక వస్తే తమ విజయావకాశాలు బాగా మెరుగుపడతయని కూడా వారు భావించారు. చాలా చోట్ల రోడ్ షోలు ఉంటాయని, కనీసం రెండు రోజుల పాటు విశాఖలోనే పవన్ కళ్యాణ్ గడుపుతారని కూడా ఊదరగొట్టారు. చివరికి పవన్ పర్యటన అన్నదే లేకుండా పోయింది. దాని మీద ఇపుడు జనసేనలోనే చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ విశాఖకు ఎందుకు రావడం లేదు అన్న చర్చ మాత్రం గట్టిగానే సాగుతోంది.పవన్ కళ్యాణ్ నిజానికి విశాఖ రావాల్సి ఉంది. కానీ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం దూకుడుగా చర్యలు చేపడుతోంది. దాంతో విశాఖ వస్తే బీజేపీ మిత్ర పక్షంగా ఏ సమాధానం చెప్పాల్సివస్తుందో అన్న ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ తన టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు అంటున్నారు. మిత్ర బంధం వల్ల లాభం లేకపోగా ఇలా వత్తిడి బాగా పెరిగిందని కూడా అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విశాఖ బంధం కట్ కావడానికి బీజేపీ కూడా కీలకమైన పాత్ర పోషించింది అని జనసైనికులు అనుమానిస్తున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ కూడా గతంలోలా విశాఖ మీద అంత మోజుతో లేరని, అందుకే ఆయన ఈ వైపుగా అసలు టూర్లు వేయడంలేదని కూడా చెప్పుకుంటున్నారు. ఎన్ని అనుకున్నా కానీ పవన్ విశాఖ మధ్యన దూరం మాత్రం అంతకంతకు పెరిగిపోతోంది. ఇది మాత్రం నిజం