ఏలూరు, మార్చి 22,
రాజకీయాల్లో ఒకటి రెండు తరాలు రాణించడం అంటేనే కష్టం.. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు నాలుగు తరాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ ఇప్పటికి మంచి ఇమేజ్‌ను కంటిన్యూ చేయడం అరుదైన విషయమే. అలాంటి అరుదైన ఘనతను శతబ్దానికి పైగా కంటిన్యూ చేస్తూ వస్తోన్న మాగంటి ఫ్యామిలీ రాజకీయాలు ఇక ముగిసినట్టే కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రాజకీయ వారసుడు అయిన కుమారుడు మాగంటి రాంజీ మరణంతో ఆ ఫ్యామిలీ ఇక రాజకీయంగా రాణిస్తుందా ? అన్న సందేహాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా మాగంటి ఫ్యామిలీ రాజకీయాలు ఉమ్మడి రాష్ట్రంలోనే ఓ వెలుగు వెలిగాయి.
మాగంటి బాబు తాత మాగంటి సీతారామ దాసు కంటే ముందు నుంచి ఈ కుటుంబం స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండేది. స్వాతంత్య్రోద్యమంలోనే గాంధీ, నెహ్రూ కుటుంబాలతో ఈ కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్న మాగంటి కుటుంబం రాజకీయంగా ఎన్నో అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. ఈ కుటుంబం నుంచి తల్లిదండ్రులు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, మాగంటి వరలక్ష్మితో పాటు తనయుడు మాగంటి వెంకటేశ్వరావు ( బాబు) సైతం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు.కాంగ్రెస్‌లో ఓ సారి ఎంపీ అయిన మాగంటి బాబు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాక టీడీపీలో మూడు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓ సారి గెలిచి.. రెండు సార్లు ఓడిపోయారు. దాదాపు 1996 నుంచి 2019 వరకు రెండు దశాబ్దాలుగా ఏలూరు పార్లమెంటుపై మాగంటి బాబు తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. ఇక ఆయన కుటుంబంలో ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు వ్యాపార రంగంలో రాణిస్తుండగా.. పెద్ద కుమారుడు రాంజీ తమ కుటుంబ దశాబ్దాల రాజకీయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మూడేళ్లుగా ఆయన జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.యువనేత లోకేష్‌తో పాటు పార్టీలో రాష్ట్ర యూత్ వింగ్‌లో మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు మాగంటి బాబు వయస్సు పైబడడంతో అంత యాక్టివ్‌గా తిరగలేకపోయారు. అప్పుడే రాంజీకి ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఇస్తారా ? అన్న చర్చలు కూడా నడిచాయి. ఎన్నికల తర్వాత మాగంటితో పాటు రాంజీ కూడా క్రియాశీలకంగా యాక్టివ్‌గా లేరు. వచ్చే ఎన్నికల నాటికి జిల్లా టీడీపీలో కీలక నేతగా ఉంటారనుకుంటోన్న టైంలోనే ఆయన మృతి చెందడం పార్టీకే కాకుండా… మాగంటి అభిమానులకు తీరని లోటు. ఇప్పటికే మాగంటి రాజకీయాలకు దూరంగా ఉండడం.. అటు కుటుంబంలో రాజకీయ వారసుడిగా ఉంటారనుకున్న రాంజీ మృతితో 130 సంవత్సరాల సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మాగంటి కుటుంబం పొలిటికల్ కథ దాదాపు సమాప్తమైనట్టే అనుకోవాలి.