తిరుపతి, మార్చి 22,
రుపతి లోక్‌సభ స్థానానికి ఈనెల 17న జగరనున్న ఉపఎన్నిక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి సవాల్‌గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయం పాలవడమనేది ఈ ఉప ఎన్నికల్లో ఏమేరకు ఓటర్లపై ప్రభావం చూపుతుందనేది ఆ పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. టీడీపీ కన్నా ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న పనబాక లక్ష్మికి ఈ ఎన్నిక మరింత సవాల్‌గా మారింది. 2019 ఎన్నికల్లో పోటీచేసి 2 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గం మొహం చూడలేదనే అపప్రదను ఎదుర్కొంటున్నారు. నిజానికి ఎన్నికల్లో ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉండటమనేది నాయకులకు అత్యంత అవసరం. అప్పుడే వారి ఓటు బ్యాంకు పదిలంగా ఉంటుంది. పనబాక లక్ష్మి మాత్రం మళ్లీ ఐదేళ్లకు ఎన్నికలు.. అప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు. ఫలితంగా ఇటు నియోజకవర్గానికి, అటు పార్టీకి దూరమై రెండిటికీ చెడ్డ రేవడిగా మారారు.సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మృతిచెందడంతో రెండేళ్లలోనే ఇక్కడ ఉప పోరు రావడం.. టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి పనబాకకే ఇక్కడ సీటు కేటాయించడం చకచకా జరిగిపోయాయి. సీటు కేటాయించినప్పుడు పనబాక లక్ష్మి కూడా ఉత్సాహంగా ప్రచారం ప్రారంభించేశారు. ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసి ఏమీ పాలుపోని స్థితిలో పడ్డారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన తర్వాత ఆమెలో ఆందోళన మొదలైందటున్నారు పరిశీలకులు. గెలవగలమా? లేదా? అనవసంర డబ్బులు ఖర్చుపెట్టడం ఎందుకు లాంటి ఆలోచనలను చుట్టుముట్టాయని, పనబాక అంతర్మథనంలో పడ్డారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. వీరంతా సహకరిస్తారో లేదో అనే బెంగ ఒకవైపు.. పార్టీకి స్థానికంలో ఎదురైన పరాభవం మరోవైపు ఆమెను కుదురుకోనీయకుండా చేస్తున్నాయని సమాచారం.అదే సమయంలో ఇన్నాళ్లుగా తాను పార్టీకి దూరంగా ఉండడం, నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం కూడా ఆమెకు మైనస్ అయ్యాయి. గత రెండు ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చారు. ఇప్పుడైనా ఇక్కడ గెలిచి తీరకపోతే తనపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడుతుందనే భయం కూడా పనబాకను వెంటాడుతోంది. మూడోసారి ముచ్చటగా ఓటమిపాలైతే రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ కూడా పడనుంది. ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో పనబాక ఏవిధంగా రాణించగలరో చూడాలి. తెలుగుదేశం పార్టీ గెలవడం ఎంత అవసరమో.. పనబాక లక్ష్మి గెలవడం ఆమెకు అంతే ముఖ్యమన్నది వాస్తవం.