YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ కువలసల గుబులు

కాంగ్రెస్ కువలసల గుబులు

హైదరాబాద్, మార్చి 22, హేమాహేమీలైన నేతలున్న కాంగ్రెస్కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్నే ఇచ్చాయి. కనీసం ఆ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో కూడా నిలువలేకపోయారు. హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్నగర్ స్థానంలో పోటీ చేసిన చిన్నారెడ్డి నాలుగో స్థానంలో, వరంగల్– నల్గొండ–  ఖమ్మం స్థానంలో పోటీ చేసిన రాములు నాయక్ ఐదో స్థానంలో నిలిచారు. ‘హైదరాబాద్’ స్థానంలో 3,57,354 ఓట్లు పోలవగా చిన్నారెడ్డికి 32,879 ఓట్లు వచ్చాయి. ‘వరంగల్’ స్థానంలో మొత్తం 3,87,969 ఓట్లు పోలవగా రాములు నాయక్కు 27,588 ఓట్లు వచ్చాయి. ఈ పరిస్థితి చూసి కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏ నాయకుడ్ని కదిలించినా పార్టీ భవిష్యత్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేడర్ అయోమయంలో కూరుకుపోయింది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు అన్ని పార్టీల కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. పోటీకి చాలా మంది నాయకులు ఆశపడ్డారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ హైదరాబాద్ వచ్చి రెండు స్థానాల ఆశావహుల పరిశీలన కోసం ప్రత్యేకంగా కమిటీలు వేశారు. చాలా మంది నేతలు తమకు అవకాశం కల్పించాలని అప్లయ్ చేసుకున్నారు.  మీటింగ్లలో తమకే ఎందుకు అవకాశం ఇవ్వాలో చెప్పుకున్నారు. పేర్లన్నీ పరిశీలించిన కమిటీలు కాచి వడబోసి రెండు, మూడు పేర్లను హైకమాండ్కు  పంపించాయి. చిన్నారెడ్డి, రాములు నాయక్ను ఆయా స్థానాలకు అభ్యర్థులుగా హైకమాండ్ ఎంపిక చేసింది. ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్  ఎన్నికల తర్వాత పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని భావించిన పీసీసీ ఆశావహ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అగ్ర నేతలు ఎక్కడికక్కడ పోటీ పడి ప్రచారాలు చేశారు. ఉత్తమ్, భట్టి, రేవంత్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలాంటి నేతలు అభ్యర్థుల తరఫున తమ నియోజక వర్గాల్లో బాగానే ప్రచారం సాగించారు. కానీ ఫలితం రాబట్టలేకపోయారు. ‘హైదరాబాద్’ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి, బీజేపీ అభ్యర్థి రాంచందర్రావు, ఇండిపెండెంట్అభ్యర్థి నాగేశ్వర్  తర్వాతి స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి పరిమితమయ్యారు. ‘వరంగల్’ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, టీజేఎస్ అభ్యర్థి కోదండరాం, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి తర్వాతి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నిలిచారు.ఉద్యోగులు, నిరుద్యోగులు అధికార పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావించింది. ప్రచారంలో నేతలు ఇవే అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోతే తాను గెలిచిన తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చిన్నారెడ్డి శపథం చేశారు. కానీ ఆ వర్గాలు పట్టించుకోలేదని ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అర్థమైపోతుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఘోరంగా ఓడిపోయామని కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో వారిని వలసల భయం వెంటాడుతోంది. ఎందరు పక్క పార్టీల బాట పడతారోననే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్ పరిధిలోని నేతలు కూన శ్రీశైలంగౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ మధ్యే కాంగ్రెస్కు గుడ్ బై  చెప్పారు. కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరారు. ఇప్పటికే పలువురు నేతలు ఇతర పార్టీలతో టచ్లో ఉన్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం ఉంటుందేమోనని కాంగ్రెస్ నేతల్లో బుగులు పట్టుకుంది.

Related Posts