YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కమల్ టార్చిలైట్ కి వెలుగు లేనట్టేనా

కమల్ టార్చిలైట్  కి వెలుగు లేనట్టేనా

చెన్నై, మార్చి 22, 
తమిళనాడులో ఎన్నికలకు సమయం మరింత దగ్గరపడుతుంది. అన్ని పార్టీలూ తమ కూటముల్లోని పార్టీలకు సీట్ల పంపిణీని ఫైనల్ చేశాయి. డీఎంకే, అన్నాడీఎంకేలు సీట్ల సర్దుబాటు ముగించుకుని ప్రచారానికి సిద్ధమయ్యాయి. అయితే మక్కల్ నీదిమయ్యమ్ అధినేత కమల్ హాసన్ తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా కమల్ హాసన్ తృతీయ కూటమిని ఏర్పాటు చేశారు. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేనని కమల్ హాసన్ ప్రకటించుకున్నారు.అయితే కమల్ హాసన్ ఏర్పాటు చేసిన తృతీయ కూటమిలోకి ఏ పార్టీ కూడా వచ్చి చేరడానికి పెద్దగా ఉత్సాహం చూపలేదు. ప్రస్తుతం కమల్ హాసన్ కూటమిలో మక్కల్ నీది మయ్యమ్ తో పాటు మరో సినీనటుడు శరత్ కుమార్ నేతృత్వంలోని భారత సమత్తువ మక్కల కట్చితో పాటు జననాయగ కట్చి పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఈ మూడు పార్టీలూ గతంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు.దీంతో తమిళనాడు తృతీయ కూటమి పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టంగా కనపడుతుంది. ఒపీనియన్ పోల్స్ సర్వే ప్రకారం మక్కల్ నీది మయ్యమ్ కు ఆరు స్థానాలకు మించి రావని తేలింది. దీంతోనే ఏ పార్టీ కూడా కమల్ హాసన్ కూటమిలోకి వచ్చి చేరేందుకు ఇష్టపడలేదు. డీఎంకే, అన్నాడీఎంకే కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు తమకు సీట్లు సరైన సంఖ్యలో కేటాయించకపోయినా సర్దుబాటు చేసుకుని ఆ కూటమిలోనే ఉండిపోయాయి.నిజానికి కమల్ హాసన్ బలంగా కన్పించి ఉంటే రెండు కూటముల నుంచి పార్టీలు వచ్చి చేరేవి. ఒక దశలో కాంగ్రెస్ ను కలుపుకుని వెళ్లాలని కమల్ హాసన్ భావించారు. డీఎంకే తక్కువ స్థానాలను కేటాయిస్తానని చెప్పడంతో కాంగ్రెస్ కూడా కమల్ హాసన్ కూటమిలోకి వెళ్లాలని డిసైడ్ అయింది. అయితే పార్టీ హైకమాండ్ ఆదేశం మేరకు కాంగ్రెస్ 25 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా కమల్ హాసన్ కూటమిపై నమ్మకం లేకనే పార్టీ లెవరూ ఆ కూటమిలో చేరేందుకు ముందుకు రావడంలేదు. మరి కమల్ హాసన్ టార్చిలైట్ ఎంత మేరకు వెలుగుతుందన్నది చూడాల్సి ఉంది.

Related Posts