హైదరాబాద్, మార్చి 22,
భారతీయ జనతా పార్టీలో ఒక్కొక్క వ్యూహకర్త ఒక్కో ఎన్నికల్లో వెలుగులోకి వస్తుంటారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే అతి కొద్ది మంది నేతలే వ్యూహకర్తలుగా సక్సెస్ అవుతారు. ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా బీజేపీ వీరి సేవలను ఉపయోగించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వారి కఠోర దీక్ష కావచ్చు. వ్యూహరచనలు కావచ్చు. బీజేపీకి విజయాలనందించే ట్రాక్ రికార్డుతోనే వారు వ్యూహకర్తలుగా వెలిగిపోతున్నారు. వారిలో ఇప్పుడు దేశ వ్యాప్తంగా అరవింద్ లింబావళి పేరు మారుమోగుతోంది.అరవింద్ లింబావళికి రాష్ట్రీయ స్వయం సేవక్ తో సుదీర్ఘమైన అనుభవముంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ఈ కన్నడ నేత రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2013లోనే కర్ణాటక శాసనసభకు మహదేవపుర స్థానం నుంచి ఎన్నికయ్యారు. అరవింద్ లింబావళి 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బాధ్యుడిగా నియమితులయ్యారు. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లోక్ సభ స్థానాల్లో బీజేపీ విజయం వెనక అరవింద్ లింబావళి కీలక భూమిక పోషించారు.అరవింద్ లింబావళి ఇప్పుడు కర్ణాటక మంత్రిగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండటం, క్రమశిక్షణతో పార్టీ అప్పగించిన పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయడంతో ఆయనను ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ పట్టుదలతో ఉంది. అందుకే పార్టీకి చెందిన వ్యూహకర్తలందరినీ పశ్చిమ బెంగాల్ లో రంగంలోకి దించింది.పశ్చిమ బెంగాల్ లోని కీలక నియోజకవర్గాలను కొన్ని అరవింద్ లింబావళికి అప్పగించనున్నారు. ఇప్పటికే కర్ణాటకకు చెందిన ఎంపీ తేజస్వి సూర్య పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్నారు. అయితే అరవింద్ లింబావళికి ప్రత్యేకంగా బాధ్యతలను అప్పగించడం పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. జేపీ నడ్డా ఈ మేరకు బాధ్యతలను అప్పగించడంతో అరవింద్ లింబావళి పశ్చిమ బెంగాల్ లో బస చేశారు. ఈ ఎన్నికల్లో సక్సెస్ అయితే అరవింద్ లింబావళి బీజేపీలో కీలక నేతగా మారతారనడంలో సందేహం లేదు.