మనిషి తాను కొన్ని బాధ్యతలకు గురై సంసార బంధాలకు సంబంధించిన విషయాలపై దృష్టిపెడుతూనే భగవతత్త్వముపై అంకితంగావించుకున్నవాడే బ్రహ్మనిష్ఠుడు కాగలడు. యోగియైనా, భోగియైనా, త్యాగియైనా, సంగవర్జితుడైనా, సంగసహితుడైనా, ఒక్కసారి బ్రహ్మచిత్తాన్ని తాను చవిచూసిన తర్వాత ఎలాంటి స్థితియందు తాను వున్నా కూడా తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు. బ్రహ్మ విరుద్ధమైన బంధ సహితుడుకాలేడు. యోగియైనా భోగియైనా, సంసారియైనా, సన్యాసియైనా స్వాంతము, సత్యమును అనుభవించితే ఆనందము ఆనందమేనంటారు.
మన చిత్తమునందు దైవత్వమును నిలుపుకుని, ఆయనకే చిత్తాన్ని అంకితం గావిస్తే ఎన్నివృత్తులయందు ఈ దేహము పాల్గొన్నప్పటికీ అది భగవత్ కైంకర్యంగా భావించాలి. ఇక్కడ మనం జనక మహారాజు విషయం చెప్పుకోవాలి. జనకుడు తన కర్తవ్యాలను నెరవేరుస్తూ, రాజ్యపాలన గావిస్తూ తన యొక్క చిత్తాన్ని దైవతత్త్వమునందు మాత్రమే ఇముడ్చుకుంటూ, లోకకళ్యాణార్థమై సర్వకర్మలూ ఆచరిస్తూ వచ్చాడు. ఒకసారి శుక మహర్షులవారు మిథిలానగర సమీపంలోనే కొంతమంది శిష్యులను చేర్చుకుని జ్ఞానోపదేశం చేస్తూ వున్నారు. ఈ సువార్త జనక మహారాజువరకూ చేరింది. జనకుడు కూడా మహర్షి శిష్యగణంలో చేరి ఆయన ప్రబోధలు వినాలని సంకల్పించాడు. ఒకనాడు ఆయన వద్దకు వెళ్లి ఆయన శిష్యులతో బాటుగా వినేందుకు అనుమతి కోరాడు. ఆనాటినుండి జనకుడు కూడా శుకమహర్షి బోధనలను వింటూవచ్చాడు. ఒకరోజున జనకుడు వచ్చేంతవరకూ శుకుడు వేచి వున్నాడు. దీనికి వారి శిష్యులు- జనకుడు ధనవంతుడనీ, మహారాజుగావున ఇలా మహర్షి లొంగిపోయారని అనుకున్నారు. ఎవ్వరెవ్వరి ప్రాప్తములు ఏయే స్థానమునందు ఏ ఏ కాలములో ఏ ఏ దిశయందు పరిపక్వత చెందుతుందో చెప్పడం సాధ్యపడదు. ఎవ్వరికైతే పుణ్యఫలం క్షీణిస్తుందో, వారు తక్షణమే పుణ్యకార్యాలు గావించి తిరిగి ఆ పుణ్యఫలాన్ని పొందాలి. అపుడే వారు ఉత్తమ స్థితి అందుకోవడానికి అవకాశం వుంటుంది. అలాగాక అలక్ష్యం చేసి తిరిగి అపవిత్ర మార్గంలో ప్రవేశించడంవలన ఉన్నటువంటి పుణ్యము కూడా పోవడమే గాకుండా వారు హీనులుగా మారేందుకు అవకాశం ఏర్పడుతుంది. శుకుడు వారి శిష్యులకు పాఠం చెప్పదల్చాడు. మరుక్షణంలోనే మిథిలాపురం అంతా మండిపోతున్నట్లుగా కనిపించింది. అపుడు ఆయన శిష్యులు, తల్లిదండ్రులు ఏమవుతారోనని, ఇళ్లు భస్మమైపోతాయని వారిని కాపాడుకోవడానికి పరుగు పరుగున వెళ్లిపోయారు. ఆ సమయంలో జనక మహారాజు అక్కడే చెక్కుచెదరకుండా కూర్చునే వున్నాడు. అది చూసిన శుకుడు, ‘జనకా! అంతఃపురానికి కూడా మంటలు ప్రాకాయి. అంతఃపురవాసులను రక్షించుకోవడానికి ప్రయత్నించు’ అన్నాడు. జనకుడు ఒక చిరునవ్వు నవ్వి దైవేచ్ఛ ఏ రీతిగా వుందో ఆ రీతిగానే జరుగుతుంది. దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. సర్వమూ ఈశ్వర సంకల్పమే అని స్థిరచిత్తుడై కూర్చుని వున్నాడు. కాసేపటికి వెళ్లిన శిష్యులు అందరూ తిరిగివచ్చారు. అందులో కొందరు ఓర్వలేని శిష్యులు, ‘స్వామీ ఊరంతా కాలుతున్నట్లు కనిపించింది కానీ వెళ్లి చూస్తే ఏ అగ్నీ లేదు. జనకుడు ఇక్కడే కూర్చున్నాడు. ఎంత స్థిరచిత్తుడాయన’ అంటూ గరువుకే చెప్పజూచారు. అపుడు శుక మహర్షి ఇలా చెప్పారు. ‘‘చపలచిత్తమైన మీకు ఎన్నిగంటలు బోధించినా ప్రయోజనం వుండదు. స్థిరచిత్తుడైనవాడు ఒక్కడు చిక్కినా చాలు. ఎన్నివేలమంది చపలచిత్తులున్నా లోకానికి ప్రయోజనముండదు. స్థిరచిత్తుడు ఒక్కడు చిక్కినా అతనికోసమే నేను వేచి వుంటాను, ఇప్పటికైనా తెల్సిందా’’ అంటూ శుకమహర్షి వారికి బుద్ధి చెప్పాడు. అందుకే శంకరాచార్యులవారు లోకానికి అలా చెప్పారు. సంఘంలో చేరి, సంఘాన్ని వదలి కొందరు సాధనలు చేస్తుంటారు. తుకారం, రామకృష్ణ పరమహంస, కబీరు, రామదాసు, త్యాగయ్యవంటివారు ఈ సంఘంలో ఒకరిగా వుంటూనే తమ తమ పద్యాలతో సర్వులకూ ఆనందాన్ని అందిస్తూనే ఆత్మతత్త్వంలోపల అంకితమై వున్నారు. మరికొందరు ఈ సంఘానికి దూరంగా అరణ్యాల్లోనో, హిమాలయాల్లోనో భగవచ్చింతన చేస్తూ బ్రహ్మలక్ష్యమునందే వారి జీవితాలను అంకితం చేశారు.