జీవితమంటే కర్మలనుసారంగా జరిగే ఒక నాటకమని కష్టసుఖాల కలబోతని చిన్నప్పుడు నుంచి వింటున్నాము కదా, మరి కొంచెమైనా జీవితాన్ని అర్థం చేసుకుంటూ సుఖాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఒకేలా స్పందించాలి కదా. మనలో ఎంతమంది అలా స్పందిస్తున్నారు అసలు స్పందిస్తున్నారా...? ఆ అలాగే స్పందిస్తున్నం అంటున్నారా మీ హృదయం మీద చేయి వేసుకొని నిజం చెప్పండి. లేదు ఎవరు కూడా స్పందించడం లేదు. స్పందించకపోగ పైపెచ్చు కష్టాలను నిందిస్తూ వాటికి కారణం భగవంతుడే అని మన మీద ఏదో ఆయనకి కోపం ఉన్నట్టు మనలని కష్టపెడుతున్నాడని ఆ తండ్రిని కూడా నిందిస్తూ ప్రతి నిమిషం బాధపడుతున్నారు నిజమా కాదా నేను చెప్పింది. అయితే ఒకటి అడుగుతాను చెప్పండి మన బిడ్డలను మనం అనవసరంగా బాధపెడుతున్నామా కొడుతున్నామా...?
అలాగే ఆ తండ్రి తన పిల్లలమైన మనలను బాధపెట్టడు.మన కర్మానుసారమే మన జీవితం. దయచేసి ఎప్పుడు ఎవరు భగవంతుడు నిందించకండి. కష్టాలు ఊరికే రావు మన జీవితంలోకి మనకు ఏదో నేర్పించడానికి మనల్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మనలో పట్టుదల పెంచటానికి వస్తాయి ఆలోచించండి మీకు అర్థమవుతుంది. ఎప్పుడు సుఖంగా ఉంటే లైఫ్ బోర్ కొడుతుంది ప్రతి నిమిషం పరిస్తితులతో సవాల్ చేయాలి అప్పుడే బాగుంటుంది జీవితం. నిజానికి మనం కష్టాలు! కష్టాలు!! అంటూ మనం తెగ బాధపడతాం కాని...
ఇంద్రుడు అంతటివాడు శాపం తట్టుకోలేక వెళ్లి తామరతూడులో దాక్కున్నాడు.
ఉనహుషుడు శాపం వలన తొండగా మారిపోయాడు.
హరిభక్తుడైన పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు తన సంపదలు కోల్పోయి గాడిదగా మారి ఊక తిన్నాడని చదివాను. పాండవులు అడవుల పాలయ్యారు. వేరేవాడి దగ్గర ఆవులు కాచారు, గుర్రాలను మేపారు. వంటలు వండారు. సేవ చేశారు.
నలుడు భార్యని కూడా కోల్పోయి తన శౌర్యం కోల్పోయి అడవుల్లో తిరిగాడు. దేవతలు తమ ప్రతిభ కోల్పోయి తలా ఓ దిక్కు పారిపోయి వందల సంవత్సరాలు దాక్కున్నారు.
ఆ రామయ్య తండ్రింతటి వాడె భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది.
శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగే దాడులు ఎదుర్కుంటూ నే ఉన్నాడు.
అనేకమంది రాక్షసులు, సైంధవుడు, జరాసంధుడు, ఎందరో కృష్ణుడి మీదికి, అతడి రాజ్యం మీదికి మాటిమాటికి దాడులు చేశారు..చివరికి తన కొడుకుని తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు. అయన భార్యలని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. రుక్మిణికి అర్జునుడు చితి పేర్చితే యోగ విద్య ద్వారా ఆ మంటల్లోకి ఆహుతి అయింది. సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి శరీరం వదిలింది.
పెళ్లింది మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతీదేవి దృతరాష్ట్రుడి తో సహా అగ్నికీలల్లో ఆహుతై పోయింది.
ఆ ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారిపోయాడు. అంతటి దేవతలు, మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు. వీటిముందు..
మనకి వచ్చే చిన్ని చిన్ని కష్టాలు ఓ లేక్కంటారా? నిజానికి మనవి కష్టాలు అంటారా? కానే కాదు. ప్రతీది కాలం నిర్ణయిస్తుంది..
మనకు ఎప్పుడు ఏది దక్కాలో అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. అది కష్టం అయినా సుఖం అయినా..
ఉక్కుని తుప్పు ధ్వంసం చేసినంత సులువుగా ప్రపంచంలోని ఏ శక్తి ఉక్కుని ధ్వంసం చేయలేదు అలాగే మన ప్రమేయం లేకుండా ఏ కష్టం మనల్ని ఏమీ చేయలేదు. కష్టంలో శ్రమను ఆయుధంగా పెట్టి సంతోషాన్ని వెతుక్కుంటామో ఆలోచనలతో సమయం వృధా చేసుకుంటూ దుఃఖానికి చేరువఅవుతామో మన చేతుల్లోనే ఉంది. ఎంత కష్టమొచ్చినా దైవంపై విశ్వాసం ఉంచాలి..
ధర్మాన్ని పాటించాలి..ఓపికతో ఉండాలి..
ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం అలా ఉన్న రోజు కష్టానికి కష్టం అనిపిస్తుంది మనల్ని ఎదుర్కోవటం తనవల్ల కాదు అని వెనుతిరుగుతుంది అప్పుడు ఎచ్చాక ఆ తండ్రి పాదాలచెంత చేరువరకు ప్రతి క్షణం ఆనందమే ఆనందం..