ఆసరా పెన్షన్ల కోసం కేంద్రం ఇచ్చేది కేవలం రూ. 210 కోట్లు మాత్రమే: ఎర్రబెల్లి
హైదరాబాద్ మార్చ్ 22
ఆసరా పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ. 11 వేల 724 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చేది కేవలం సంవత్సరానికి రూ. 210 కోట్లు మాత్రమే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఈ డబ్బును 6 లక్షల మందికే ఇస్తున్నారు. 39 లక్షల 36 వేల 521 మందికి రాష్ర్ట ప్రభుత్వం ఆసరా పెన్షన్లు ఇస్తుందన్నారు.ఆసరా పెన్షన్ పథకం కింద లబ్ది పొందుతున్న వారి వివరాలు, ఖర్చుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో ఆసరా పెన్షన్ పథకం కింద 39,36,521 మంది ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. వృద్ధ్యాప పెన్షన్ కింద 13,19,300ల మంది, వితంతువులు 14,43,648, వికలాంగులు 4,89,648, నేత కార్మికులు 37,342, కల్లుగీత కార్మికులు 62,942, హెచ్ఐవీ రోగులు 28,582, మలేరియా వ్యాధిగ్రస్తులు 14,410, బీడీ కార్మికులు 4,08,621, ఒంటరి మహిళలు 1,32,298ల మంది లబ్ది పొందుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకానికి సంవత్సరానికి రూ. 11 వేల 724 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పేద వర్గాల కోసం రాష్ర్ట ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏ రాష్ర్టంలో కూడా ఇలాంటి పథకం అమలు కావడం లేదు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, చేనేత కార్మికులతో పాటు మిగతా వారందరికీ ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఉమ్మడి ఏపీలో ఈ స్కీం కొద్ది మందికే పరిమితమై ఉండే అని గుర్తు చేశారు. ఇప్పుడు ఒంటరి మహిళలకు కూడా ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. 57 ఏండ్ల వారికి పెన్షన్ ఇచ్చే అంశం.. కరోనా కారణంగా ఆలస్యమైందన్నారు. త్వరలోనే దీనిపై విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. ఆసరా పెన్షన్లు ఇస్తున్న తర్వాత చాలా వరకు వృద్ధులకు గౌరవం లభించిందన్నారు. ఇది కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. వికలాంగులను, ఒంటరి మహిళలను గౌరవించింది సీఎం కేసీఆర్ ప్రభుత్వమే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.