ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నెల్లూరులో ఆనం వివేకానందరెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆనం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉదయం అయన అమరావతినుంచి హెలికాప్టర్ లో నెల్లూరు చేరుకున్నారు. వివేకా తమ్ముడు రాంనారాయణరెడ్డిని, కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు ఆనం వివేకనందరెడ్డి ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకునే వ్యక్తి అని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనం నిత్యం ప్రజలలో ఉన్న వ్యక్తి అని చెప్పారు. ఎన్ని విమర్శలు ఎదురైనా ఎవరికీ తలవంచని, భయపడని ధీశాలి ఆనం వివేకానందరెడ్డి అని చెప్పారు. వివేకాను తుదిసారి చూసేందుకు ఆయన అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతూ బుధవారం ఉదయం హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో వివేకా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
అంతకుముందు జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో హెలికాప్టర్ దిగిన చంద్రబాబుకు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాధ్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు, పాశం సునీల్ కుమార్, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ వెంకటస్వామి నాయుడు, జిల్లా ఉన్నతాధికారులు, టీడీపీ నేతలు స్వాగతం పలికారు.