YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉక్క పోయిస్తున్న ఉక్కు

ఉక్క పోయిస్తున్న ఉక్కు

ఉక్క పోయిస్తున్న ఉక్కు
విశాఖపట్టణం, మార్చి 23, 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఇబ్బందిగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ విషయంలో తాము ముందుకు పోవడానికి సిద్ధమయింది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంటోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ అడుగులు ఎటువైపు అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. ఒకవేళ ప్రయివేటీకరణ విషయంలో ఫెయిలయితే మాత్రం జగన్ కు భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు.ఇప్పటికే విపక్షాలు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ను తప్పుపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందుగానే జగన్ కు చెప్పి స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెట్టిందన్న ఆరోపణలు చేస్తున్నాయి. కేవలం ప్రధాని మోదీకి లేఖలు రాసినంత మాత్రాన సరిపోదని, కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంపై జగన్ ఎలా వత్తిడి తీసుకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.నిజానికి కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి చేసే పరిస్థితుల్లో జగన్ లేరు. బీజేపీ కేంద్రంలో బలంగా ఉండటం, వైసీపీ సహకారం ఇప్పట్లో అవసరం ఏమీ లేకపోవడంతో జగన్ నిస్సహాయ స్థితిలోనే ఉన్నారు. బెదిరింపులకు దిగితే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందన్న నమ్మకం లేదు. మూడు సాగు చట్టాలకు నిరసనగా నెలల తరబడి రైతులు ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో చేస్తున్నా మోదీ ప్రభుత్వం దిగిరాలేదు. అలాంటిది స్టీల్ ప్లాంట్ విషయంలో వెనకడుగు వేస్తుందన్న నమ్మకం లేదు.దీంతో జగన్ కేంద్ర ప్రభుత్వం ను బతిమాలుకోవడం మినహా మరేం చేయలేని పరిస్థితి ఉంది. అయితే ప్రత్యామ్నాయ మార్గాలను జగన్ దీనిపై అన్వేషిస్తున్నారని చెబుతున్నారు. ప్రయివేటు పరం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై నిపుణుల అభిప్రాయం సేకరిస్తున్నారు. ఇది ఎంతవరకూ సాధ్యమన్నది ఇంకా తేలకున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు ఇబ్బందిపడకుండా నిర్ణయం తీసుకోవాలన్నది జగన్ ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాలి.
రాజ్యసభలో లొల్లి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం గురించి వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వరంగ సంస్థలు సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశగా పనిచేస్తాయన్న ఆయన, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు ఒప్పుకొనే ప్రసక్తే లేదని స్సష్టం చేశారు. ‘‘ప్రైవేట్‌ రంగ సంస్థలు లాభార్జనే ఏకైక ధ్యేయంగా నడుపుతాయి. కాబట్టి సంస్థను ప్రైవేటీకరించడం సరికాదు’’ అని పేర్కొన్నారు. ఇక స్టీల్‌ప్లాంట్‌కు కోకింగ్‌ కోల్‌ కొరత ఉందన్న విజయసాయిరెడ్డి, సంస్థకు సొంత గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా వైజాగ్‌ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.ఇక విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ గురించి పలువురు రాజకీయాలు చేయడంపై ట్విటర్‌ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి.. ‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు "గంటలు" కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తుత్తి రాజీనామాతో  సొంత "గంట" మోగిస్తున్నారు. ఆ "గంట"లో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ధిలేదు. ఆ "గంట" శబ్దాల వెనుకున్న ప్రయోజనాలు అసలు ఉద్యమకారులకు తెలియదా? ఈ గంటే గతంలో విశాఖలో "భూగంట" మోగించలేదా?’’ అని ప్రశ్నించారు. 

Related Posts