YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పోరాడి ఓడిన తీన్మార్ మల్లన్న

పోరాడి ఓడిన తీన్మార్ మల్లన్న

పోరాడి ఓడిన తీన్మార్ మల్లన్న
వరంగల్, మార్చి 23, 
ఏపార్టీతో సంబంధంలేదు. ఒంటరిగా పోరాటం. ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం సమస్యలపై ఉద్యమం. అదే తీన్మార్ మల్లన్నకు అన్ని ఓట్లు తెచ్చిపెట్టాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి రాజకీయ పార్టీలు ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తీన్మార్ మల్లన్న నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నిజానికి గత ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకే కాంగ్రెస్ ఈ టిక్కెట్ ఇచ్చింది. అప్పుడు ఓడిపోవడంతో తిరిగి మల్లన్నకు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గ్రామానికి చెందిన వారు. గత మూడేళ్లుగా తీన్మార్ మల్లన్నగా సోషల్ మీడియాలో సుపరిచుతులు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, ప్రజాసమస్యలపై స్పందిస్తూ తీన్మార్ మల్లన్న ప్రజలకు చేరువయ్యారు. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన రాజకీయ విశ్లేషణలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదే తీన్మార్ మల్లన్నకు ఓట్ల వర్షం కురిపించింది.పట్టభద్రుల స్థానంలో పోటీ చేయాలని భావించిన తీన్మార్ మల్లన్న గత ఐదు నెలల నుంచి ఆ జిల్లాల్లో పాదయాత్ర చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకోవడంలో తీన్మార్ మల్లన్న సక్సెస్ అయ్యారు. ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఏ రాజకీయ పార్టీ, ఏ అండా లేకపోయినా పట్టభద్రులు ఆదరించారనే చెప్పాలి. ప్రొఫెసర్ కోదండరామ్ పోటీ లో ఉన్నా తీన్మార్ మల్లన్న ద్వితీయ స్థానంలో నిలిచారంటే ఆయన చేసిన కృషి, పడ్డ శ్రమకు అద్దం పడుతుంది.తీన్మార్ మల్లన్న ఓటమి పాలు కావచ్చు. నైతికంగా విజయం సాధించినట్లే. అధికార పార్టీ అన్ని రకాలుగా బలవంతంగా ఉన్నప్పటికీ తీన్మార్ మల్లన్న వైపు ప్రజలు చూశారంటే ఏం చేయాలో ఇప్పటికైనా మిగిలిన రాజకీయ పార్టీలకు అర్థం కావాల్సి ఉంటుంది. కేవలం పార్టీ కార్యాలయాలకే పరిమితమై మీడియా పులులుగా ఉంటే ప్రజలు ఆదరించరన్నది స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణలో పార్టీలకే కాదు కష్టపడే వారినీ ప్రజలు వారి వైపు చూస్తారనడానికి తీన్మార్ మల్లన్న ఉదాహరణ.

Related Posts