YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఖమ్మం నుంచి షర్మిల పోటీ

ఖమ్మం నుంచి షర్మిల పోటీ

ఖమ్మం, మార్చి 24, తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం స్థాపిస్తానంటూ.. రాజ‌కీయ అరంగేట్రం చేసిన వైఎస్ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల త్వర‌లోనే రాజ‌కీయ పార్టీని పెట్టబోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం చేజిక్కించుకోవ‌డ‌మా ? లేక ప్రధాన ప్రతిప‌క్షంగా చ‌క్రం తిప్పడ‌మా ? అనే వ్యూహంతో వైఎస్ ష‌ర్మిల జోరుగా ముందుకు సాగుతున్నార‌నే అంచ‌నా ఉంది. అయితే.. దీనికి ముందు.. పార్టీ (ఇంకా ప్రక‌టించాల్సి ఉంది) అధ్యక్షురాలిగా వైఎస్ ష‌ర్మిల ఎక్కడ నుంచి పోటీ చేయ‌నున్నారు ? ఏ నియోజ‌క‌వ‌ర్గం అయితే..ఆమెకు కంచుకోట‌గా ఉంటుంది? అనే అంశాలు రాజ‌కీయంగా చ‌ర్చకు వ‌స్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచ‌నాల ప్రకారం.. ఖ‌మ్మం జిల్లా (ఏపీ స‌రిహ‌ద్దు) నుంచి వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయ ప్రవేశం ఉంటుంద‌ని చెబుతున్నారుఖ‌మ్మం జిల్లాను తీసుకుంటే.. ఇక్కడి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు..కాంగ్రెస్‌కు ఒక‌ప్పుడు కంచుకోట‌లుగా ఉన్నాయి. వాటిలో ఒక‌టి పాలేరు రెండోది కొత్తగూడెం. ఈ రెండిట్లోనూ వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్ జెండానే ఎగ‌ర‌గా… ఇక్కడ ఇద్దరు నేత‌లు మంత్రులు కూడా అయ్యారు. కొత్తగూడెంలో వ‌న‌మా వెంక‌టేశ్వర‌రావు.. పాలేరులో రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఇద్దరూ మంత్రులుగా ప‌నిచేశారు. వైసీపీ ఆవిర్భవించిన త‌ర్వాత‌.. రెండు రాష్ట్రాల్లోనూ 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైసీపీ మూడు సీట్లు గెలుచుకోవ‌డంతో పాటు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీగా ఓటు బ్యాంకు సాధించింది. అందుకే వైఎస్ ష‌ర్మిల ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టారు.ఇక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తంగా వైసీపీకి అనుకూలంగా మారిపోయింది. ప్రధానంగా వైఎస్ అభిమానులు ఎక్కువ‌గా ఉన్నది కూడా ఖ‌మ్మంలోనే కావ‌డంతో ఆ పార్టీకి క‌లిసి వ‌చ్చింది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో సామాజిక స‌మీక‌ర‌ణ‌లతో పాటు క్రిస్టియ‌న్‌, మైనార్టీ ఓటు బ్యాంకు కూడా నాడు వైసీపీకి అనుకూలంగా ఉంది. ఇక్కడ ఏపీ సెటిల‌ర్స్ ఓటింగ్ ఉండ‌డంతో కూడా వైఎస్ ష‌ర్మిల పోటీకి ఈ జిల్లానే ఎంచుకోవాల‌ని దాదాపు నిర్ణయం తీసుకున్నట్టే అంటున్నారు. ప్రధానంగా పాలేరు మీదే ష‌ర్మిల దృష్టి ఉందంటున్నారు. వైఎస్ త‌న‌య‌గా.. త‌న‌ను పాలేరు ప్రజ‌లు ఆశీర్వదిస్తార‌ని.. వైఎస్ ష‌ర్మిల ఒక అంచ‌నాకు వ‌చ్చినట్టు స‌మాచారం.వైఎస్ ష‌ర్మిల గ‌తంలో పాద‌యాత్ర చేసిన‌ప్పుడు ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో ఆమెకు బ్రహ్మరథం ప‌ట్టారు. ఇటీవ‌ల ఖ‌మ్మం రాజ‌కీయ నేత‌లు, వైఎస్ అభిమానుల‌తో చ‌ర్చలు జ‌రిపిన‌ప్పుడు కూడా పాలేరు, కొత్తగూడెం నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితుల‌నుఆమె ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. దీనిని బ‌ట్టి వైఎస్ ష‌ర్మిల చూపు ఈ జిల్లా మీదే ఉంద‌నే విష‌యాన్ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. మొత్తానికి వైఎస్ ష‌ర్మిల పోటీ చేసే జిల్లాపై అయితే.. ఒక క్లారిటీ వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
షర్మిలతో స్వర్ణజిత్ సేన్ భార్య భేటీ
వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టేందుకు జరుగుతున్న ముందస్తు ప్రయత్నాల నేపథ్యంలో మరో కీలక వ్యక్తి ఆమెతో భేటీ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీలో ఆయన చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా పని చేసిన స్వరన్ జీత్ సేన్ భార్య అనితా సేన్ బుధవారం వైఎస్ షర్మిలతో బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్‌లో భేటీ అయ్యారు. షర్మిల లోటస్‌ పాండ్‌ ఆఫీస్‌లో వైఎస్ షర్మిలను స్వరన్ జీత్ సేన్ సతీమణి అనితా సేన్ కలిశారు. వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్‌తో అనితా సేన్ కాసేపు చర్చలు జరిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వరన్‌ జీత్‌ సేన్‌ డీజీపీగా పనిచేశారు. ఆ సమయంలో వైఎస్‌కు ఈయనకు సత్సంబంధాలు ఉండేవి. తాజాగా వైయస్ షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీకి స్వరన్‌ జీత్ సేన్‌ సలహాదారుడిగా పనిచేసే అవకాశముందని చర్చ జరుగుతోంది.ఇప్పటికే వైఎస్ హయాంలో పని చేసిన మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు షర్మిలను కలిసి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. కొందరిని ఆమె పెట్టే పార్టీకి సలహాదారులుగా కూడా షర్మిల నియమించుకున్నారు.

Related Posts