హైదరాబాద్, మార్చి 24, అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైనప్పటి నుంచి నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. క్రికెట్ కంటే కాంట్రవర్సీలే ఎక్కువ. అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలు. తాజాగా మరో వివాదం అజార్ మెడకు చుట్టుకుంటోంది. అజార్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసును రీ ఎంక్వైరీ చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పట్టుబడుతుండటంతో అజారుద్దీన్ కు మ్యాచ్ ఫిక్సింగ్ కేసు మళ్లీ మెడకు చుట్టుకోనుందా అన్న చర్చ మొదలైంది.అజారుద్దీన్ పై గతంలో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసును సీబీఐ పునర్వించారించాలని పట్టుబడుతోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. అంతే కాదు అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలుస్తామంటోంది. అజారుద్దీన్‌కి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని కేవలం హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాత్కాలిక అనుమతి మాత్రమే కోర్టు ఇచ్చిందని అంటోంది టీసీఏ.హెచ్‌సీఏ ఎన్నికల నామినేషన్ సమయంలోనూ అజార్ కాంట్రవర్సీగా మారాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఉన్నందున అజార్ నామినేషన్ చెల్లదని అడ్డుకున్నాయి వ్యతిరేక ప్యానెల్స్. అయితే..తనకు క్లీన్ చిట్ వచ్చిందని కొన్ని ఆధారాలను ఎన్నికల అధికారికి సమర్పించి బరిలోకి దిగాడు. ఆజార్ రాకతో హెచ్‌సీఏ రూపురేఖలే మారుతాయని క్రికెట్ సంఘాలన్నీ అతనికి మద్దతు తెలిపాయి. కానీ మళ్లీ ఆయనపై వ్యతిరేక ప్యానల్స్ గురిపెట్టాయి. తాజాగా ఫిక్సింగ్ ఆరోపణలు తెరమీదకు తీసుకొచ్చాయి.దేశానికి అత్యుత్తమ క్రికెటర్లను అందించిన సంఘం హెచ్‌సీఏ. అయితే అదంతా గతం. ఇప్పుడు దోచుకోవడమే తప్ప ఆట లేదు. బీసీసీఐ నుంచి అప్పనంగా వచ్చి పడుతున్న కోట్లు.. హెచ్ సీఏ పెద్దల జేబులు నింపుతున్నాయ్ తప్ప.. ఆటను అభివృద్ధి చేయలేకపోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.