YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అధికారులు ముందు చూపుతో ప‌ని చేయాలి

అధికారులు ముందు చూపుతో ప‌ని చేయాలి

ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కంటి వెలుగు కార్యక్ర‌మాన్ని ముందు చూపుతో, ప్ర‌ణాళికా బ‌ద్దంగా సిద్ధం చేయాల‌ని వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి సంబంధిత అధికారుల‌కు ఆదేశించారు. ఎక్క‌డ రాజీ ప‌డ‌కుండా నాణ్య‌మైన, మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా సంసిద్ధం కావాల‌ని చెప్పారు. సిఎం కెసిఆర్ ఆదేశంగా వ‌చ్చిన ఈ ప‌థ‌కాన్ని స‌ఫ‌లం చేయ‌డానికి అధికారులు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేయాల‌ని మంత్రి అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు. ఆరోగ్య‌శ్రీ కార్యాల‌యంలో వివిధ ఉన్న‌తాధికారుల‌తో మంత్రి స‌మావేశ‌మై కంటి వెలుగు కార్య‌క్ర‌మంపై వివిధ అంశాల వారీగా సుదీర్ఘంగా స‌మీక్షించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ తీసుకున్న విస్తృత‌, ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం కంటి వెలుగు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లందిరికీ కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, వ్యాధుల నిర్ధార‌ణ చేసి, వాటికి త‌గు చికిత్స‌, మందులు, శ‌స్త్ర చికిత్స‌లు అందించ‌డం మామూలు అంశం కాద‌న్నారు. సిఎం ఏ కార్య‌క్ర‌మం తీసుకున్నా, అందులో ఎంతో ప‌ర‌మార్థం ఉంటుంద‌న్నారు. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీ ప‌డ‌కుండా కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని స‌ఫ‌లం చేయ‌డానికి అధికారులు శ‌క్తి వంచ‌న లేకుండా ప‌ని చేయాల‌న్నారు. ప‌రిక‌రాలు స‌హా, కంటి అద్దాలు, మందులు, చికిత్స‌లు అన్నీ నాణ్య‌త‌, మెరుగైన ప్ర‌మాణాల‌తో నిర్వ‌హించాల‌ని సూచించారు. త‌గిన సాఫ్ట్‌వేర్‌, హార్డ్ వేర్‌ల‌ను కూడా సిద్ధం చేసుకోవాల‌న్నారు. అలాగే భారీ ఎత్తున నిర్వ‌హించే ఈ కంటి వెలుగు ప‌రీక్ష‌ల కోసం ఏయే గ్రామాల్లో ఏవిధంగా శిబిరాలు నిర్వ‌హించాలి? ఎలాంటి ప్ర‌శ్నావ‌ళిని ప్ర‌జ‌ల‌కు వేయాలి? ఏ విధంగా వారి వ్యాధుల‌ను గుర్తించాలి? అందుకు ఏయే విధమైన వ్య‌వ‌స్థ ఉండాలి? వంుటి అన్ని అంశాల‌తో జాగ్ర‌త్త‌గా సిద్ధం కావాల‌న్నారు. కంటి వెలుగు ప‌రీక్ష‌ల కార్య‌క్ర‌మంలో 60వేల మంది వైద్య ఆరోగ్య సిబ్బంది భాగ‌స్వాములు కానున్నార‌ని మంత్రి తెలిపారు. 27వేల మంది ఆశా లు, ఇత‌ర సిబ్బంది క‌లిసి మొత్తం కంటి వెలుగు కార్యక్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నార‌న్నారు. అయితే, ఆయా టీమ్‌ల‌ను న‌డ‌ప‌డానికి త‌గిన సూప‌ర్‌వైజ‌ర్లు, అధికారుల బృందాన్ని రెడీ చేయాల‌ని సూచించారు.కంటి వెలుగు కార్య‌క్రమంలో స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని మంత్రి అధికారుల‌కు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌ను గుర్తించాల‌ని, వారితో మాట్లాడి, ఈ నెల 30న స‌మావేశం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాల‌న్నారు. స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌త్యేక‌త‌ల‌కు త‌గ్గట్లుగా వారి స‌హాయ‌, స‌హ‌కారాలు తీసుకోవాల‌ని మంత్రి చెప్పారు.అలాగే వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. వైద్య ఆరోగ్య‌శాఖ‌తోపాటు, పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్‌శాఖ‌, రెవిన్యూ, పోలీసు వంటి వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. శిబిరాల నిర్వ‌హ‌ణ స‌మ‌యంలో ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్ళాల‌న్నారు.

అలాగే రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీల స‌హ‌కారం కూడా తీసుకోవాల‌ని మంత్రి చెప్పారు. మెడిక‌ల్ కాలేజీల సిబ్బంది, సీనియ‌ర్ రెసిడెంట్లు, హౌజ్ స‌ర్జ‌న్లు, పీజీల స‌హాయం కూడా కంటి వెలుగు కార్య‌క్ర‌మానికి తోడ్ప‌డుతుంద‌ని చెప్పారు. అందుకే ఆయా మెడిక‌ల్ కాలేజీ యాజ‌మాన్యాల‌ను సైతం భాగ‌స్వాముల‌ను చేయాల‌ని, ఒక తేదీని నిర్ణ‌యించి స‌మావేశం నిర్వ‌హించాల్సిందిగా మంత్రి ఆదేశించారు .వేగంగా మ‌రో 15 రోజుల్లో ప్ర‌ణాళిక‌లు సిద్ధ‌మ‌య్యే విధంగా అధికారులు ప‌ని చేయాల‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి ఆదేశించారు. రెగ్యుల‌ర్ ప‌నుల‌తోపాటు కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకోవాల‌ని, నిర్ణీత గ‌డువుల్లో ప‌నులు పూర్తి చేయాల‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.ఈ స‌మీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శాంతికుమారి, కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌, ఆరోగ్య‌శ్రీ సిఇఓ మాణిక్ రాజ్‌, డిఎంఇ డాక్ట‌ర్‌ ర‌మేశ్‌రెడ్డి, సిపిఓ డాక్ట‌ర్‌ శ్రీ‌నివాస‌రావు, స‌రోజ‌నీ కంటి ద‌వాఖానా సూపరింటెండెంట్ డాక్ట‌ర్ రవింద‌ర్‌గౌడ్‌, డాక్ట‌ర్ మోతీలాల్ కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని స‌మ‌న్వ‌యం చేస్తున్న ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Related Posts