YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో ఏపి ఫస్ట్

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో ఏపి ఫస్ట్

దేశంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయడంలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని, దీనికి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. సచివాలయంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగు జాడలో పయనిస్తూ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామావు, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. గతంలో కంటే కాస్మోటిక్, డైట్, కుట్టు ఛార్జీలతో పాటు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి నిధులు పెంచిందన్నారు. డిపార్టుమెంట్ అటాచ్డ్ హాస్టళ్లో విద్యనభ్యిస్తున్న విద్యార్థులకు అందిస్తున్న నెలవారీ ఉపకార వేతనాలను రూ.1,050 – రూ.1,200ల నుంచి రూ.1400లకు పెంచామన్నారు. కాలేజీ అటాచ్డ్ హాస్టళ్లలో ఉంటూ విద్యనభ్యిస్తున్న విద్యార్థులకు రూ.520 – రూ.1200ల నుంచి రూ.1000 – రూ.1400లకు పెంచామన్నారు. డే స్కాలర్ విద్యార్థులకు అందిస్తున్న నెలవారీ ఉపకార వేతనాలను పెంచామన్నారు. ప్రస్తుతమిస్తున్న రూ.182 – రూ.550ల నుంచి రూ.600లు – రూ.1000లకు పెంచామన్నారు. విభిన్న ప్రతిభావంతల విద్యార్థులకు కూడా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సమానంగా ఉపకార వేతనాలను పెంచామని మంత్రి తెలిపారు. ఈబీసీ, బీసీ, మైనార్టీ, కాపు విద్యార్థులకు కూడా ఇచ్చే ఉపకార వేతనాలను గతంలో కంటే పెంచామన్నారు. రాష్ట్రంలో వివిధ గిరిజన, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు డైట్ , కాస్మోటిక్ ఛార్జీలతో పాటు ఏకరూపు దుస్తుల కుట్టు ఛార్జీలు పెంచామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. వాటితో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం ప్రస్తుతమిస్తున్న రూ.10 లక్షల ఆర్థిక సాయం రూ.15 లక్షలకు పెంచామన్నారు.నాలుగేళ్లలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.29,025.02 కోట్లు కేటాయించగా, రూ.25,853.02 కోట్లు ఖర్చు చేశామని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధుల వినియోగానికి ఎప్పటికప్పుడు, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించామన్నారు. 19 నోడల్ ఏజెన్సీ సమావేశాలు నిర్వహించగా, సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన 4 రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాలు జరిపామన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎస్సీ సబ్ ప్లాన్ కింద ప్రభుత్వం రూ.11,228.11 కోట్లు కేటాయించిందన్నారు. చంద్రన్న పెళ్లి కానుకకు రూ.100 కోట్లు, భూమి కొనుగోలు పథకానికి రూ.100 కోట్లు, చర్మకారులకు రుణ సదుపాయం కల్పించడానికి రూ.60 కోట్లు, డప్పు కళాకారులకు రూ.12 కోట్లు కేటాయించామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ 2018-19 కింద రూ.1,105.77 కోట్లు కేటాయించామన్నారు. గిరిజన సబ్ ప్లాన్ కింద 42 శాఖల్లో 197 పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. గత నాలుగేళ్లలో గిరిజన ఉప ప్రణాళిక కింద రూ.10,033.45 కోట్లు కేటాయించగా, రూ.8,737 కోట్లు ఖర్చు చేశామన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.4,176.60 కోట్లు కేటాయించామన్నారు. గిరిజన విద్యార్థులకు అంబేద్కర్ విదేశీ విద్యా నిధి కింద ఈ నాలుగేళ్లలో 317 మందికి రూ.21.55 కోట్లతో విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించామన్నారు. 2018-19 ఆర్థిక సంత్సరానికి రూ.33 కోట్లు కేటాయించామన్నారు. స్కిల్ డవలప్ మెంట్ కింద 5,401 ఎస్సీ నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూర్చామన్నారు. గిరిజ యువతకు నేటి వరకూ రూ.68.17 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎస్సీలకు జగ్జీవన్ జ్యోతి పథకం కింద 50 యూనిట్ల నుంచి 75 యూనిట్ల వరకూ ఫ్రీ విద్యుత్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. జగ్జీవన్ జ్యోతి పథకం కింద 26 లక్షల షెడ్యూల్డ్ కులాలు, గిరిజన కుటుంబాలకు రూ.193.71 ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. 2018-19 సంవత్సరానికి గానూ రూ.148. 65 కోట్లు కేటాయించామన్నారు. 250కు పైగా జనాభా ఉన్న ఎస్సీ కాలనీల్లో రూ.452 కోట్లతో రోడ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. గిరిజన ప్రాంతాల్లో రూ.863 కోట్లతో 2,871 కిలో మీటర్లలో రోడ్ల నిర్మిస్తున్నామన్నారు. ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో రూ.487.11 కోట్లతో డార్మొటరీస్, ప్రయోగ శాలలు, వంట, భోజన శాలలు, ప్రహారీ గోడలు రెండు అరల బెంచీలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రూ.117 కోట్లతో 9 కొత్త రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్సులను నిర్మించామన్నారు. గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణకు నాలుగేళ్లలో రూ.512 కోట్లు ఖర్చు చేశామని, 2018-19 ఆర్థిక సంత్సరానికి గానూ రూ.250 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో 9 మంది ఎస్సీ విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారన్నారు. ముగ్గురు విద్యార్థులు గిన్నీస్ బుక్ లో చోటు సాధించారన్నారు. చైనాలో జరిగిన వరల్డ్ మెమరీ చాంపియన్ షిప్ పోటీల్లో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కు చెందిన నలుగురు విద్యార్థులు విజయం సాధించారన్నారు.గిరిపుత్రిక కల్యాణ పథకం కింద గత నాలుగేళ్లలో రూ.3,493 మంది గిరిజన మహిళలకు రూ.17.46 కోట్లు అందజేశామన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ 1,646 మంది లబ్ధిదారులకు రూ.8.23 కోట్లు కేటాయించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. అటవీ పరిరక్షణ హక్కు చట్టం కింద 22,791 మంది గిరిజనులకు 94,929 ఎకరాలకు పట్టాలు అందజేశామన్నారు.  అంబేద్కర్ స్మృతి వనం పేరిట 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతిలో 20 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. 

Related Posts