ఖమ్మం, మార్చి 25,
ప్లాస్టిక్ మహమ్మారి రోజురోజుకీ పర్యావరణాన్ని మింగేస్తుంది. పేపరు వాడకాన్ని తగ్గించిన ప్రజలు రోజువారీ పనుల్లో ప్లాస్టిక్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. గతంలో సరుకులు తేవాలంటే చేతిలో ఒక సంచితో బజారుకు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఇందుకు భిన్నంగా ఉంది. చేతిలో ఏ సంచి లేకపోయినా జేబులో డబ్బులు ఉంటే చాలు ఏవస్తువైనా తెచ్చుకునే వీలు కల్పిస్తున్నారు దుకాణదారులు. చిన్నసైజునుండి పెద్దసైజు వరకు ప్లాస్టిక్ కవర్లలో సరుకులను తెచ్చుకునే వీలు కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం మానవ శరీరంపై తీవ్ర హాని తలపెడుతుందని శాస్త్రజ్ఞులు తెలిపినప్పటికీ ప్రజలు మాత్రం ఇవేమి పట్టించుకునే తీరికలో లేరు. నాసిరకం ప్లాస్టిక్ వస్తువుల తయారీతో లాభాలు గడిస్తున్న ఉత్పత్తిదారులు ప్రజల ఆరోగ్యం గురించి ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. గతంలో సుప్రీం కోర్టు ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ పాలకులు మాత్రం కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ను వినియోగించవద్దంటూ కేవలం నామమాత్ర హెచ్చరికలు చేస్తున్నారేతప్ప వాడకాన్ని నిషేధించడంలో ఖచ్చితంగా తీసుకోవలసిన చర్యలపట్ల విఫలమవుతున్నారు. దీంతో రోజూ ప్లాస్టిక్ వాడకం గుట్టల్లో పేరుకుపోతుంది. వీధుల వెంబడి, మురికిగుంటలు, చెరువుల వద్ద వాడిపడేసిన ప్లాస్టిక్ కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తుంది. ఇంతజరుగుతున్నప్పటికీ ప్లాస్టిక్ వాడవద్దని ప్రచారం కల్పించడంలో మున్సిపాలిటీలు, పంచాయితీలు చర్యలు తీసుకోవడంలేదు. క్యారీబ్యాగులో ఇంటికి సరుకులు తీసుకవెళ్లిన తర్వాత ఆ క్యారీబ్యాగులు చెత్తబుట్టలో పడేయడం అలవాటుగా మారింది. వాడిపడవేసిన ప్లాస్టిక్ భూమిలో కలసి పోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందంటే ప్లాస్టిక్ భూతం ఏవిధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్లాస్టిక్‌ను మూగజీవాలు ఆహారంగా తీసుకోవడంవల్ల పెనుప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్లాస్టిక్ కాల్చడంతో వచ్చే పొగ వాతావరణంలో కాలుష్యంగా మారి ప్రజలు ఆ వాసనను పీల్చడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్లాస్టిక్ వాడకంలో నిషేధాజ్ఞలు విధించి పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా విశ్లేషకులు కోరుతున్నారు.