న్యూఢిల్లీ మార్చ్ 25
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రిపోర్టు వెల్లడించింది. ఇది 100 రోజులు పాటు ఉండనుందని కూడా ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమైన ఈ సెకండ్ వేవ్.. ఏప్రిల్ 15 తర్వాత మరింత ముదురుతుందని అంచనా వేసింది. మార్చి 23 వరకూ నమోదైన కేసుల ట్రెండ్‌ను బట్టి చూస్తే సెకండ్ వేవ్‌లో ఇండియాలో కేసుల సంఖ్య 25 లక్షలుగా ఉంటుందని తెలిపింది.ఈ కరోనా సెకండ్ వేవ్‌కు అడ్డుకట్ట వేయడానికి స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్లు, ఆంక్షలు అంత ప్రభావం చూపించడం లేదని ఈ 28 పేజీల నివేదిక స్పష్టం చేసింది. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేపట్టడమే దీనికి ఏకైక పరిష్కరమని తేల్చి చెప్పింది. పలు రాష్ట్రాల్లో విధిస్తున్న లాక్‌డౌన్లు, ఆంక్షల ప్రభావం వ్యాపారాలపై ఎలా ఉంటుందో వచ్చే నెలలో తెలుస్తుందని ఎస్‌బీఐ రిపోర్ట్ తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించింది. ప్రస్తుతం రోజుకు 34 లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తుండగా.. దీనిని కనీసం 40-45 లక్షలకు పెంచాలని చెప్పింది. అలా చేస్తే 45 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి 4 నెలలు పడుతుంది.