కర్నూలు మార్చ్ 25
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో నిర్మించిన ఎయిర్‌పోర్టును ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ కూడా ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రితో కలిసి ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించిన జగన్.. జాతికి అంకితం చేశారు. ముందుగా సీఎం జగన్ జాతీయ జెండాను, తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఇండిగో సంస్థ మార్చి 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ జనవరి 15న లైసెన్స్ జారీ చేయగా.. బీసీఏఎస్ సెక్యూర్టీ క్లియరెన్స్ జనవరి 27న మంజూరైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్‌వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్‌తో పాటు మౌలిక వసతులను కల్పించారు.సిపాయి తిరుగుబాటు కంటే ముందే రైతుల పక్షాన పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఈ పోర్ట్‌కు పెడుతున్నట్లుగా ప్రకటించారు జగన్ మోహన్ రెడ్డి. కర్నూల్ నుండి ప్రయాణం అంటే రోడ్డు, రైలు మార్గంలోనే ఇప్పటివరకు జరగగా.. ఇక నుంచి విమానాల ద్వారా ప్రయాణాలు సాగించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే ఐదు విమానాశ్రయాలు ఉండగా దీంతో రాష్ట్రంలో విమానాశ్రయాల సంఖ్య ఆరుకు చేరుకోనుంది.