న్యూ ఢిల్లీ మార్చ్ 25
ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. జపాన్ సముద్ర జలాల్లో ఆ మిస్సైళ్ల టెస్ట్ జరిగినట్లు అమెరికాతో పాటు జపాన్ వెల్లడించింది. నిజానికి బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించవద్దన్న ఆంక్షలు ఉత్తర కొరియాపై ఉన్నాయి. కానీ ఆ నిషేధ ఆజ్ఞలను నార్త్ కొరియా ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను నార్త్ కొరియా బేఖాతరు చేసింది. ఉత్తర కొరియా చేపట్టిన మిస్సైల్ పరీక్షలను జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఖండించాయి. క్షిపణలకు చెందిన శిథిలాల తమ జలాల్లో పడలేదని జపాన్ పేర్కొన్నది. ఉత్తర కొరియా అక్రమ రీతిలో బాలిస్టిక్ క్షిపణులను సమీకరిస్తున్నదని, దీని వల్ల సమీప దేశాలకు సమస్యలు తలెత్తుతాయని యూఎస్ పసిఫిక్ కమాండ్ పేర్కొన్నది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉత్తర కొరియా క్షిపణులను పరీక్షించడం ఇదే మొదటిసారి. అయితే బాలిస్టిక్ మిస్సైళ్లను ఉత్తర కొరియా పరీక్షించడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్నది. యూఎన్ భద్రతా మండలి ఆ క్షిపణుల పరీక్షలను నిషేధించింది. వీటిని టెస్ట్ చేయవద్దు అని కిమ్, ట్రంప్ మధ్య 2018లో ఓ ఒప్పందం కూడా జరిగింది.