హైదరాబాద్ మార్చ్ 25 కరోనా సంక్షోభం వల్ల అత్యంత దారుణంగా దెబ్బతిన్న రంగాల్లో విద్యారంగం ముందు వరసలో ఉంటుంది. ఒకటి కాదు.. రెండు విద్యాసంవత్సరాలు ప్రభావితం అయ్యాయి. గతేడాది కొవిడ్ ఉధృతికి టెన్త్ - ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేసింది. పిల్లలు అకడమిక్ ఇయర్ నష్టపోవద్దనే ఉద్దేశంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.కానీ.. కొవిడ్ తీవ్రత కొనసాగడంతో 2020-21 విద్యాసంవత్సరం కూడా షెడ్యూల్ ప్రకారం ప్రారంభం కాలేదు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన చాలా కాలం తర్వాత ఆన్ లైన్ తరగతులు కొనసాగించాలని ఆదేశించింది ప్రభుత్వం. చాలా విద్యాసంస్థల్లో మొక్కుబడిగానే ఈ క్లాసులు కొనసాగాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనైతే ఇలాంటి తరగతులు జరగలేదు. పరిస్థితులు చక్కబడుతున్నాయని భావించిన ప్రభుత్వం.. ఫిబ్రవరిలో విద్యాసంస్థలు తెరవడానికి అనుమతించింది.
లాక్ డౌన్ కారణంగా విద్యాసంవత్సరం చాలా వరకు నష్టపోవడంతో.. సిలబస్ తగ్గించి పాఠాలు బోధించాలని విద్యాశాఖ ఆదేశించింది. కానీ.. నెలరోజులు కూడా విద్యాసంస్థలు నడిచాయో లేదో.. మార్చిలో మళ్లీ కరోనా విజృంభణ మొదలైంది. పాఠశాలలు - హాస్టళ్లు - కాలేజీల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూశాయి. దీంతో.. అప్రమత్తమైన ప్రభుత్వం మరోసారి విద్యాసంస్థల మూసివేతకు ఆదేశించింది. ఆ విధంగా.. మార్చి 24 నుంచి వైద్యవిద్యాలయాలు మినహా అన్ని రకాల విద్యాసంస్థలు మూతపడ్డాయి. అంతేకాదు.. డిగ్రీ - పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
దీంతో.. టెన్త్ - ఇంటర్ పరీక్షల అంశం తెరపైకి వచ్చింది. ఈ పరీక్షలను కూడా రద్దు చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ ప్రకటించకపోయినప్పటికీ.. రద్దు చేసే అవకాశమే ఉందంటున్నారు. ఈ మేరకు మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి పలు కారణాలను కూడా చూపుతున్నారు.షెడ్యూల్ ప్రకారం.. మే 17 నుంచి మే 26 వరకు టెన్త్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ మే 1 నుంచి మే 19 వరకు - సెకండియర్ పరీక్షలు మే 2 నుంచి మే20 వరకు కొనసాగాలి. కానీ.. ఇప్పుడు విద్యాసంస్థలు మూసివేయడంతో ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయో తెలియదు. ఒకవేళ రీ-ఓపెన్ అయినా.. పనిదినాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఇదిలాఉంటే.. ఇప్పటి వరకూ ఆన్ లైన్ తరగతుల ద్వారా ప్రైవేటు విద్యార్థులు మాత్రమే పాఠాలు విన్నారు. అది కూడా అరకొరే. ఈ పరిస్థితుల్లో పరీక్షలు పెడితే.. ప్రభుత్వ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారనే వాదన ఉంది. ఇక కరోనా ఉధృతి ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇంకోవైపు.. తమిళనాడు ప్రభుత్వం టెన్త్ ఇంటర్ పరీక్షలను రద్దుచేస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. తెలంగాణ సర్కారు కూడా టెన్త్ ఇంటర్ పరీక్షలను రద్దు చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.