కేంద్రం రాష్ట్రాలకు ఉదారంగా లక్షల కోట్ల నిధులు ఇస్తోందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్రమోదీ అనేక అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని.. సొమ్మొకరిది సోకొకరిది అన్న చందంగా.. నిధులు కేంద్రానివి-ప్రచారం రాష్ట్రాలదని తెలుగు రాష్ట్రాలనుద్దేశించి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ అన్నారు.
పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ లక్ష్మన్ మాట్లాడుతూ....ఈ నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, అమలు చేస్తున్న పథకాలపై.. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలతో చర్చలకు సిద్ధమని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. మే 5న కేంద్‌పమంత్రి నితిన గడ్కరి హైదరాబాద్ రానున్నట్లు, రూ.1523 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు-మెదక్, ఆరంఘర్-శంషాబాద్ 6 లైన్ల రోడ్డు, అంబర్‌పేట్‌లో 4 లేన్ల ఫ్లైఓవర్‌తో పాటు ఉప్పల్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను నితిన్ గడ్కరి ప్రారంభిస్తారని, అదేరోజు రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం ఉంటుందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. దశాబ్ధాల చరిత్రలో దేశంలో 2647 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారులను అభివృద్ధి చేస్తే, ఈ నాలుగేళ్ల మోదీ పాలనలో తెలంగాణలో 2656 కిలోమీటర్లు రహదారులను అదనంగా అభివృద్ధి చేస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.
తెలంగాణలో జాతీయ సగటుకు మించి 4.6 కిలోమీటర్ల రహదారుల విస్తరణ జరిగిందని, జాతీయ రహదారుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 3.50 లక్షల కోట్లతో 40 వేల కిలోమీటర్ల రహదారి అభివృద్ధి విస్తరణకు మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా ఆర్థిక కారిడార్లు, లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి కేంద్రం చర్యలు చేపట్టిందని, సరిహద్దు ప్రాంతాలను కలిపే ఆర్థిక, వాణిజ్య హబ్‌లను వేగవంతం చేయడంతో పాటు...2022 నాటికి దేశవ్యాప్తంగా 32 కోట్ల పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 367 కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టిందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 24 లాజిస్టిక్ పార్క్‌లను గుర్తించిందని, తెలంగాణలో హైదరాబాద్‌కు ఒక లాజిస్టిక్ పార్కును మంజూరు చేసిందని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. కేంద్రం ఉదారంగా రీజినల్ హైవేలను మంజూరు చేసిందని, హైదరాబాద్ చుట్టూ 4 వరుసల రహదారులను మంజూరు చేసిందని, ఇందుకు 4 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని, 250 కిలోమీటర్ల రహదారి నిర్మాణం కోసం 3 వేల కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసిందని, ఇందుకు సంబంధించి భూసేకరణకు కూడా నిధులు మంజూరు చేసిందన్నారు. సంగారెడ్డి-గజ్వేల్-భువనగిరి-చౌటుప్పల్ రింగురోడ్డు 156 కిలోమీటర్ల మార్గం , చౌటుప్పల్-షాద్‌నగర్- చేవెళ్ల 186 కిలోమీటర్లు, మెదక్ - సిద్దిపేట-ఎల్కతుర్తి 133 కిలోమీటర్లు, అలాగే జాతీయ రహదారులుగా ఘట్‌కేసర్-మహబూబాబాద్-కొత్తగూడెం రహదారులను ఎంతో ముందుచూపుతో కేంద్ర మంత్రి అభివృద్ధి చేస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ఇవాళ తెలంగాణ 2వ స్థానంలో ఉందని, ఇది ముమ్మాటికీ మోదీ ప్రభుత్వ ఘనత మాత్రమేనని డాక్టర్ లక్ష్మన్ కొనియాడారు. తెలంగాణలో గ్రామీణ సడక్ యోజన కింద 205 కోట్లతో కేంద్రం రహదారులను అభివృద్ధి చేస్తుందని, ఈ పథకంలో భాగంగా ఇప్పటికే తొలిదశలో రహదారులు, వంతెనల నిర్మాణం చేపట్టారన్నారు. హైదరాబాద్-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే, హైదరాబాద్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత మోదీ ప్రభుత్వానిదని డాక్టర్ లక్ష్మన్ కొనియాడారు.
ఇటీవలే సూర్యపేటలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ చేతుల మీదుగా ఉజ్వల పథకంలో భాగంగా 20 లక్షల మంది పేదలకు ఉచిత గ్యాస్ పంపిణీ చేశామని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. అలాగే ఆయుస్మాన్ పథకంలో భాగంగా తెలంగాణలోని ఎయిమ్స్‌కు 3500 కోట్లు కేటాయించి త్వరితగతిన పనులు చేపట్టాలని కేంద్రం ఆదేశించినట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. ఎయిమ్స్ విషయంలో రాష్ట్రం స్థలాన్ని సేకరించి అభివృద్ధికి దోహద పడాలని, టీఆర్ఎస్ నేతలు యాగీ చేయడం తగదని డాక్టర్ లక్ష్మన్ సూచించారు.
ప్రధాని మోదీ సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్ నినాదంతో.. ఏ రాష్ట్రంలో.. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాజకీయాలకతీతంగా.. అభివృద్ధి ఎజెండాతో నిధులు కేటాయిస్తున్నారన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం రాజీ లేని కృషి చేస్తుందని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు.
పదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన నిధులకంటే...ఈ నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం ఏపీకి 3 రెట్లు అధిక నిధులు ఇచ్చిందని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం ఏమీ ఇవ్వడం లేదన్నట్లు ప్రచారం చేయడం, ప్రజలను రెచ్చగొట్టి స్వార్ధ రాజకీయాలు చేయడం దారుణమని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.
గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మోదీ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చేందుకు కృషి చేస్తున్నామని, ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణలో 20 లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, స్వచ్ఛభారత్‌లో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించి ఇస్తున్నారని, ఇందుకోసం ఒక్కో ఇంటికి 12 వేల రూపాయలు ఇస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు బిజెపిని గెలిపిస్తున్నారని, 2014లో కేవలం 5 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న బిజెపి.. ఇవాళ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ కేసీఆర్..థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అంటూ...రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, రాష్ట్రంలోని నియంతృత్వ పోకడలు, కుటంబ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అనూహ్య మార్పులు సంభవిస్తాయని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. పేదల సంక్షేమం కోసం పాటు పడుతున్న మోదీ.. దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధాని ఫసల్ బీమా యోజన, బేటీ పడావో-బేటీ బచావో, ప్రధానమంత్రి సురక్ష యోజన, బాలికా సమృద్ధి పథకం వంటి అనేక పథకాలు అమలుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చూసైనా.. టీఆర్ఎస్ నేతలు చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని డాక్టర్ లక్ష్మన్ హితవు పలికారు.
టీఆర్ఎస్ పాలనలో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని, బడుగు, బలహీన వర్గాలు, అట్టడులు వర్గాలకు న్యాయం జరగాలంటే రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతో ఉందని డాక్టర్ లక్ష్మన్ అన్నారు.2019 లో తెలంగాణలో బిజెపి పాగా వేయడం ఖాయమని డాక్టర్ లక్ష్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. .