YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వరుస భేటీల ఆంతర్యం.. ఏమిటో

వరుస భేటీల ఆంతర్యం.. ఏమిటో

విశాఖపట్టణం, మార్చి 26, 
ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘమైన ఆలోచన చేస్తేనే మిగిలిన వారు బుర్ర పట్టుకుంటారు. అలాంటిది ఒకరికి ముగ్గురు అన్నట్లుగా ఒక చోట చేరి మంతనాలను జరిపారూ అంటే అందులో కీలకమైన విషయాలే ప్రస్థావనకు వచ్చి ఉంటాయనుకోవాలి. సరిగ్గా ఈ సందేహమే ఇపుడు వైసీపీ పెద్దలను కూడా అసలు స్థిమితంగా ఉండనీయడంలేదు. విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీకి కంట్లో నలుసుగా మారుతున్నారు.గంటా శ్రీనివాసరావు ఇపుడు సొంత రాజకీయానికి తెర తీశారు. అటు వైసీపీ, ఇటు టీడీపీలకు సమాన దూరం పాటిస్తూ ఆయన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కావడం మీద భావసారూప్యం కలిగిన వారిని కూడగడుతున్నారు. మరో వైపు హఠాత్తుగా హైదరాబాద్ వెళ్ళి మరీ తెలంగాణా మంత్రి కేటీఆర్ ని విశాఖకు ఆహ్వానించారు. ఇక ఏపీలో కొందరు ప్రముఖ నేతలతో కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు. దాంతో ఆయన మీద వైసీపీ ఎంపీ విజయ్సాయిరెడ్డి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. విశాఖ స్టీల్ ఉద్యమానికి గంటలు కట్టి సొంత రాజకీయాన్ని గంటా శ్రీనివాసరావు చూసుకుంటున్నారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. విశాఖలో భూ గంట మోగించినది ఎవరో అందరికీ తెలుసు అంటూ ఆయన‌ అనుచరుల భూ కబ్జా భాగోతాలను తెర మీదకు తెచ్చారు.ఇక గత ఎన్నికల్లో ఓటమి పాలు అయిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇపుడు మళ్ళీ యాక్టివ్ కావడం కూడా వైసీపీని కలవరపెడుతోంది. దాదాపుగా రెండు లక్షల డెబ్బై అయిదు వేల ఓట్లను విశాఖ లోక్ సభ ఎన్నికల్లో కైవశం చేసుకున్న జేడీ వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్నారు. దానికి గానూ ఆయన కార్యక్షేత్రాన్ని విశాఖగా ఎంచుకున్నారు. ఆయన కూడా విశాఖలోనే మకాం వేసి మరీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద జేడీ కూడా ఉద్యమిస్తున్నారు. ఇపుడు ఆయన గంటా శ్రీనివాసరావు తో తరచూ భేటీలు వేయడంతో వైసీపీలో అసహనం పెరుగుతోందా అన్న చర్చ వస్తోంది. ఈ క్రమంలో మళ్ళీ జేడీ మీద కూడా వైసీపీ విమర్శలు స్టార్ట్ చేసింది. ఆయన పదవిలో ఉన్నపుడు అధికారంలో ఉన్న వారికి ఊడిగం చేసి ఇపుడు మాత్రం వివేకానందుడి మాదిరిగా నీతులు చెబుతున్నారు, ఆయన స్టీల్ ప్లాంట్ ని ఉద్ధరించేది ఏంటి అంటూ విజయసాయిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలే చేశారు.వీరికి తోడు అన్నట్లుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా విశాఖలో ప్రత్యక్షం అయ్యారు. ఆయన ఇపుడు వైసీపీని జగన్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు తో భేటీ అయ్యారు. మరి ఈ ముగ్గురి మంతనాలు ఏంటి, వేరి ఆలోచనలు ఏంటి అన్నది తెలియకనే వైసీపీ విలవిలలాడుతోంది అంటున్నారు. మొత్తానికి విశాఖలో చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డికి గంటా మార్క్ పాలిటిక్స్ కానీ జేడీ యాక్టివ్ కావ‌డం కానీ నచ్చడంలేదు అంటున్నారు. చూడాలి మరి ఈ పరిణామాలు ఏ వైపునకు దారితీస్తాయో.

Related Posts